Stains Remove Tips: ఇలా చెయ్యండి చాలు.. చెమట మరకలు మాయం..
Stains Remove Tips: చెమట వాసన అయితే దుస్తులు ఉతికితే సరిపోతుంది. కానీ, చెమట వల్ల ఏర్పడే మరకలు తొలగించడం చాలా కష్టం. ప్రధానంగా కాలర్‌పై, ఆర్మ్‌పిట్స్ వద్ద దుస్తుల రంగు మారిపోతుంది. చెమట కారణంగా వచ్చే మరకలు ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చెమట మరకలు ఎలా తొలగించాలి?
అధిక చెమట వల్ల చొక్కాలపై మరకలు ఏర్పడటం సహజమే. ఈ సమస్య ఎక్కువగా పురుషులలో కనిపిస్తుంది. ముఖ్యంగా చొక్కా చంకాల్లో (underarms) చెమట వల్ల మసక లేదా పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. వీటిని సాధారణంగా సబ్బుతో ఎంత ఉతికినా పూర్తిగా పోవు. అలాంటి మరకలతో ఉన్న చొక్కాలను వేసుకోవడం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ మరకలను సులభంగా తొలగించవచ్చు. అవేంటో, వాటిని ఎలా వాడాలో చూద్దాం.
చెమట మరకలు ఎందుకు ఏర్పడతాయి?
చెమటలో ఉండే ఉప్పు, యూరియా, ప్రోటీన్లు చర్మంపై ఉన్న బ్యాక్టీరియాతో కలిసినప్పుడు పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. అలాగే, డియోడరెంట్లలో ఉండే అల్యూమినియం, చొక్కా తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు కూడా ఈ మరకలకు కారణమవుతాయి. అందుకే ఈ మరకలు సాధారణంగా ఉతికితే.. తొలగించడం కష్టం.
నిమ్మరసం, ఉప్పు :
ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి మరకలపై రాసి 10–15 నిమిషాలు ఉంచండి. అనంతరం మామూలుగా ఉతికితే, నిమ్మరసంలోని సహజ బ్లీచింగ్ గుణం వల్ల చెమట మరకలు సులభంగా తొలగిపోతాయి.
బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా సహజ శుభ్రపరిచే గుణం కలిగిన పదార్థం. ఒక బకెట్ వేడి నీటిలో 2 చెంచాల బేకింగ్ సోడా కలిపి, అందులో చెమట మరకలున్న చొక్కాను 30 నిమిషాలు నానబెట్టి, తరువాత ఉతికితే మరకలు సులభంగా తొలగిపోతాయి.
వైట్ వెనిగర్ :
చొక్కాలోని చెమట మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. వాషింగ్ మెషిన్‌లో చివరి రౌండ్‌లో ఒక కప్పు వెనిగర్ కలిపితే, మరకలు పోతాయి . చేతితో ఉతికే వారు.. ఒక బకెట్ నీటిలో అరకప్పు వెనిగర్ వేసి, ఆపై చొక్కాను అందులో నానబెట్టాలి. తర్వాత చొక్కాను ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇది మరకలను తగ్గించడమే కాక, దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్ :
అరకప్పు నీటిలో 1 చెంచా హైడ్రోజన్ పెరాక్సైడ్, 1 చెంచా బేకింగ్ సోడా కలిపి మరకలపై రాసి 15 నిమిషాలు ఉంచండి. తరువాత సాధారణంగా ఉతికితే గట్టిగా పడిన చెమట మరకలు కూడా తొలగిపోతాయి.
గమనిక: ఈ పద్ధతిని కేవలం కాటన్ చొక్కాలకే ఉపయోగించాలి. రంగు దుస్తులకు లేదా మాడ్రన్ మెటీరియల్‌కి అనువు కాదు.