- Home
- Life
- Sitting Risks: ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండెపోటు ఒక్కటే కాదు.. ఎన్ని రోగాలొస్తాయో తెలిస్తే షాక్ అవుతారు..
Sitting Risks: ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండెపోటు ఒక్కటే కాదు.. ఎన్ని రోగాలొస్తాయో తెలిస్తే షాక్ అవుతారు..
Sitting Risks: గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల గుండె జబ్బులతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

మీరు రోజులో ఎక్కువ సేపు కూర్చునే పని చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనం తేల్చేసింది. అంతేకాదు వెన్నెముక సామర్థ్యం దెబ్బతింటుంది.
చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. దీనికి తోడు పని గంటలకు మించి కూర్చొంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధకలు కనుగొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా చిన్న వయసు వారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తాయి.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెదడు, వెన్నెముక పై విపరీతంగా ఒత్తిడి పడుతుంది. దీంతో వెన్నుముక, డిస్క్ సంబంధిత సమస్యల బారిన పడాల్సి వస్తది.
గంటల తరబడి కూర్చునే చాలా మంది విపరీతమైన ఒంటి నొప్పులతో బాధపడతారు. దీంట్లో ప్రధానంగా మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు దారుణంగా ఉంటాయి. అందుకే పని మధ్య మధ్యలో అటు ఇటూ కొద్ది సేపు నడవాలి. ఐదు నిమిషాల పాటు మెట్లు ఎక్కడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Norwegian University of Science and Technology నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సేపు కూర్చునే వారికే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
అంతేకాదు కూర్చుని ఎక్కువ సేపు పనిచేసే వారికి వెరికోస్ వెయిన్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలాగే పాదాలకు రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా ఎడమ కాలులో కనిపిస్తాయి.
కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు పనిచేసేవారిలో వెన్ను నొప్పి సర్వ సాధారణమే. అయితే ఒకే దగ్గర ఒకే పొజీషన్ లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే ఎంజైమ్ లు 90 శాతం తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు గంటల పాటు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ 20 శాతం తగ్గుతుందట. అందుకే ఇప్పటి నుంచైనా పనిమధ్య మధ్యలో లేచి నడవండి.