బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే సింపుల్ టిప్స్ ఇవిగో
ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం, పప్పులు కచ్చితంగా ఉంటాయి. వాటిని ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా పురుగులు పట్టేస్తుంటాయి. అయితే పురుగు పట్టిన తర్వాత శుభ్రం చేసే కంటే అసలు పురుగులు పట్టకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయండి
సాధారణంగా బియ్యాన్ని తెచ్చిన సంచీల్లోనే ఉంచి వాడుతుంటారు. ఇదే అసలు తప్పు. సంచీల్లో ఉంచడం వల్ల బియ్యానికి త్వరగా పురుగులు పట్టేస్తాయి. అందువల్ల బియ్యం ఇంటికి తెచ్చిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో ఉంచితే అసలు పురుగులు పట్టకుండా ఉంటాయి. మూత తీసినప్పుడు మర్చిపోకుండా వేయడం అలవాటు చేసుకోవాలి.
పొడి చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి
చాలా మంది బియ్యాన్ని వంటింట్లోనే స్టోర్ చేస్తారు. అక్కడ వేడి, తేమ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వేడి, తేమ ఉన్న చోట బియ్యం నిల్వ చేస్తే పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరే గదిలో బియ్యాన్ని స్టోర్ చేయాలి. ఆ ప్లేస్ చల్లని, పొడి ప్రదేశమై ఉండాలి.
నీళ్లను, తేమను దూరంగా ఉంచండి
మీరు గమనిస్తే వంటింట్లో స్టోర్ చేసిన బియ్యమే ఎక్కువ పురుగు పడుతుంది. ఎందుకంటే అక్కడ నీళ్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ గదిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లేస్ లో బియ్యం స్టోర్ చేయడం, అందులోనే డబ్బాల్లో కాకుండా బియ్యం సంచుల్లోనే ఉంచేయడంతో త్వరగా పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. బియ్యం నిల్వచేసే చోట తడిగా ఉండకూడదు. తేమ ఉంటే బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుంది.
బియ్యాన్ని ఎండలో 1–2 గంటలు ఉంచండి
బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే కొన్న వెంటనే గంట నుంచి రెండు గంటల పాటు ఎండలో ఉంచండి. ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉండే తేమ పోతుంది. తేమ లేకపోతే బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా ప్రతి రెండు నెలలకొకసారి బియ్యం ఎండలో వేస్తే పురుగులు పట్టకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది.
పురుగులు పట్టిన బియ్యాన్ని ఇలా శుభ్రం చేయండి..
కొన్ని వేప ఆకులు లేదా కొన్ని చుక్కల వేప నూనెను బియ్యంలో కలిపితే పురుగులు దరిచేరవు. బియ్యంలో 4 లవంగాలు లేదా మిరియాలు వేసినా పురుగుల నుంచి రక్షణ కలుగుతుంది. బియ్యం తీసుకున్న వెంటనే కడిగి ఎండబెట్టి నిల్వ చేస్తే పురుగులు పడే అవకాశాన్ని తగ్గించవచ్చు.