ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకోకండి.. లేదంటే లేనిపోని సమస్యలొస్తయ్ జాగ్రత్త..
బరువు తగ్గడం మంచిదే. అలాగని మరీ ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే మాత్రం చిక్కుల్లో పడతారు. అవును వేగంగా బరువు తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రోజుల్లో అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. కానీ వీటి వల్ల డయాబెటీస్, అధిక రక్తపోటు నుంచి గుండెపోటు వరకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. ఈ సమస్యల ముప్పు తప్పాలంటే మాత్రం ఖచ్చితంగా బరువును తగ్గాల్సిందే. బరువును తగ్గించుకునేందుకు గంటల తరబడి జిమ్ముల్లో చెమటలు చిందిస్తుంటారు. కష్టమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. అందంగా కనిపించడానికి వీలైనంత తొందరగా బరువు తగ్గడానికి ఆరాటపడేవారుచాలా మందే ఉన్నారు. కానీ ఇలా ఫాస్ట్ గా బరువు తగ్గడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
మహిళలు బరువు తగ్గడానికి సగటు కాలపరిమితి ఎంత?
సాధారణంగా మహిళలు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడానికి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. స్లిమ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వేగంగా బరువు తగ్గాలని కోరుకోవడం మామూలు విషయం కాదు. ఏదేమైనా నెమ్మదిగా, మరింత స్థిరంగా బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకున్న వ్యక్తులు అంటే వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలో తగ్గాలనుకున్న వారు కోరుకున్న బరువును ఎక్కువ కాలంలో పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ గా బరువు తగ్గడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవక్రియ స్థాయి పడిపోతుంది
జీవక్రియ అనేది మనం తీసుకునే కేలరీలను బర్న్ చేయడానికి మన శరీరం చేసే ప్రక్రియ. క్షీణించిన జీవక్రియ దీర్ఘకాలికంగా బరువును తగ్గించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీరు ఎప్పుడూ అలసటగా, బద్దకంగా ఉంటారు.
బరువు తగ్గడాన్ని కొనసాగించడం మీకు మరింత కష్టమవుతుంది
ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అంటే కొవ్వును కోల్పోవడం, కండర ద్రవ్యరాశిని తగ్గించడం కాదు. ఒకవేళ మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే.. దానిని అలాగే కంటిన్యూ చేయడం కష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొవ్వుకు బదులుగా కండర ద్రవ్యరాశిని తగ్గించొచ్చు
మనం అకస్మాత్తుగా కేలరీల తీసుకోవడం తగ్గించినప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే మీరు కోల్పోతున్నది కొవ్వు మాత్రమే కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ కండర ద్రవ్యరాశిని కూడా కోల్పోతారు. ఇది మీ శరీర బలాన్ని తగ్గిస్తుంది.
అవసరమైన పోషకాలను కోల్పోతారు
మన శరీర అవయవాలకు అవసరమైన పోషకాలు చాలా అవసరం. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వు ఏదైనా సరే అవి మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరపడతాయి. మరింత మెరుగ్గా పనిచేయడానికి విటమిన్లు, ఖనిజాలు అవసరం కావొచ్చు. మీరు కేలరీలను తీసుకోనప్పుడు లేదా కార్బోహైడ్రేట్లు లేదా పాడి వంటి ప్రాథమిక ఆహారాలను మొత్తమే తిననప్పుడు మీ శరీరంలో పోషక లోపం వస్తుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
మలబద్ధకం వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు
అలసట, శక్తిని కోల్పోవడం
ఎముక సాంద్రత కోల్పోవడం, బలం తగ్గడం
రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం
పెళుసైన గోర్లు
జుట్టు రాలడం
సులభంగా నిర్జలీకరణానికి గురవుతారు
బరువు తగ్గే ప్రాసెస్ లో కేవలం కొన్ని ఆహార పదార్థాలపైనే దృష్టి పెడతాయి. వీటివల్ల నీటిని తీసుకోవడం చాలా తగ్గిస్తారు. దీనివల్ల మీ బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. డీహైడ్రేషన్ తో ప్రమాదకరమైన రోగాలే కాదు.. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.
మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
త్వరగా బరువు తగ్గడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. తొందరగా బరువు తగ్గాలనుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మీకు అనోరెక్సియా లేదా బులిమియా వంటి తినే రుగ్మతలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.