Periods Pain: అమ్మమ్మల నాటి చిట్కా, పీరియడ్స్ పెయిన్ ని నిమిషాల్లో తగ్గించొచ్చు..!
మన అమ్మమ్మలు, అంతకు ముందు తరం వాళ్లు... ఈ నొప్పి నుంచి బయటపడేందుకు వంటింట్లో లభించే వస్తువులనే వాడే వారు. వాటిని వాడే మనం కూడా ఈ పీరియడ్ పెయిన్ నుంచి బయటపడొచ్చు.

period pain
అమ్మాయిలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. అయితే, పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది. కొందరు కడుపులో నొప్పి, మరికొందరు నడుము నొప్పితో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు నొప్పిని తగ్గించినప్పటికీ.. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని నొప్పి భరించడం కూడా కష్టమే. అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... ఈ నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
అమ్మమ్మల నాటి చిట్కా
ఈ రోజుల్లో అంటే... ప్రతి దానికీ మందులు దొరుకుతున్నాయి. కానీ, ఒకప్పుడు అలా మందులు ఉండేవి కాదు. అందుకే.. మన అమ్మమ్మలు, అంతకు ముందు తరం వాళ్లు... ఈ నొప్పి నుంచి బయటపడేందుకు వంటింట్లో లభించే వస్తువులనే వాడే వారు. వాటిని వాడే మనం కూడా ఈ పీరియడ్ పెయిన్ నుంచి బయటపడొచ్చు.
పీరియడ్ పెయిన్ ని చిటికెలో తగ్గించే పసుపు...
పసుపు మన అందరి ఇళ్ల్లో పసుపు చాలా సులభంగా లభిస్తుంది. ఈ పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. అవి.. పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి.పసుపు ఎమ్మెనాగోగ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.పీరియడ్స్ సమయంలో గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగితే చాలు. చాలా వరకు పీరియడ్ పెయిన్ తగ్గుతుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ ని కూడా మేనేజ్ చేస్తుంది. సంతానోత్పత్తికి కూడా సహాయపడుతుంది.
పీరియడ్ పెయిన్ ని తగ్గించే వాము...
వాములో ఉండే థైమాల్ అనే పదార్థం గర్భాశయ కండరాలను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. దీని వలన పీరియడ్ పెయిన్ తగ్గి, శరీరానికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, వాము రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, వాపు , గ్యాస్ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పీరియడ్ నొప్పి తగ్గించుకోవాలనుకునే వారు వాము నీరు మరిగించి గోరువెచ్చగా తాగవచ్చు. అలాగే వాము, జీలకర్ర, కొద్దిగా అల్లం వేసి టీలా మరిగించి తాగితే మరింత ఉపశమనం కలుగుతుంది. భోజనం తర్వాత వాము పొడి, నల్ల ఉప్పుతో తీసుకోవడం కూడా మంచిది. అయితే, వామును ఎక్కువగా వాడకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వాము నీరు లేదా టీ తీసుకోవడం సరిపోతుంది. ఈ విధంగా వాము సహజమైన నొప్పి నివారణగా పని చేస్తుంది.