చిన్న వయసులో గడ్డం తెల్లబడుతోందా? కారణం ఇదే కావొచ్చు..
ఈ రోజుల్లో యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నయ్.. ఒక్క నెత్తిలనే కాదు.. గడ్డానికి కూడా.. కానీ గడ్డంలో తెల్లవెంట్రుకలు వయసును పెంచేస్తాయి. అందుకే ఇలా కాకుండా చూసుకోవాలి.

ఒకప్పుడు మీసాలను చిన్నగానే ఉంచుకునే వారు. గడ్డం మొత్తానికే తీసేసే వారు. ఇక కొందరైతే.. రెండింటినీ ఉంచుకోరు. కానీ ప్రస్తుతం పొడవాటి గడ్డం, మీసాలను పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. నటుల నుంచి సాధారణ జనాల వరకు దీన్నే ఫాలో అవుతున్నారు. ఇదంతా బానే ఉన్నా ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా తెల్లజుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు. నెత్తిలో వెంట్రుకలే కాదు.. గడ్డంలోని వెంట్రుకలు కూడా తెల్లగా మారుతున్నాయి. కానీ గడ్డంలో తెల్ల వెంట్రుకలు మీ వయసును పెంచేస్తాయి. ఎంత పెద్ద వయసు అని ఎదుటివారు అనుకునేలా చేస్తాయి. ఇలా అనుకోకూడదని చాలా మంది గడ్డానికి కూడా రంగు వేస్తుంటారు. కానీ మీరు రంగు వేసినట్టు ఇతరులకు ఈజీగా తెలుస్తుంది. అయినా ఈ రంగు కూడా తొందరగా పోతుంది. అసలు చిన్నవయసులో గడ్డం ఎందుకు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విధంగా చేస్తే మెలనిన్ పెరుగుతుంది
మెలనిన్ ఒక వర్ణద్రవ్యం. ఇది సహజ రంగును ఇస్తుంది. దీనివల్ల జుట్టుకు, చర్మానికి మంచి రంగు వస్తుంది. ఈ వర్ణద్రవ్యం చాలా జీవుల్లో కనిపిస్తుంది. ఈ మెలనిన్ మన శరీరంలో లోపించినప్పుడు కళ్లు, జుట్టు, చర్మం రంగు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇది జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.
ఈ వర్ణద్రవ్యం బాగా ఉత్పత్తి కావాలంటే సిట్రస్ పండ్లను ఎక్కువగా తినండి. అలాగే ఆకు కూరలను, బెర్రీలను ఎక్కువగా తినండి. ఈ ఆహారాలు మీ శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ జుట్టు తెల్లబడే అవకాశం తగ్గుతుంది.
స్మోకింగ్ చేస్తే జుట్టు తెల్లగా మారుతుందా?
ఈ రోజుల్లో చిన్నవయసు వారు కూడా స్మోకింగ్ చేస్తున్నారు. పొగతాగడం వల్ల కూడా శరీరంలో సహజ వర్ణద్రవం మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. మితిమీరిన ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడానికి కారణం అవుతుంది. దీనివల్ల చిన్నవయసులోనే తల, గడ్డం వెంట్రుకలు తెల్లబడతాయి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీంతో గడ్డం రంగు నలుపు నుంచి తెలుపు రంగులోకి మారుతుంది.
చిన్నవయసులో తెల్లజుట్టు ఎందుకు వస్తుంది
నేటి కాలంలో చాలా మంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవయసులో తెల్ల జుట్టు రావడం, జుట్టు ఊడిపోవడం వంటివన్నీ లైఫ్ స్టైల్ కారణంగానే కాదు.. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీ ఆహారంలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఇతర పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల తెల్లవెంట్రుకలు తగ్గిపోతాయి.