Instant Dosa: పప్పు నానపెట్టకుండా, పిండి రుబ్బకుండా.. 20 నిమిషాల్లో దోశ చేసేయండి..!
Instant Dosa: దోశ వేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ, దాని పిండి తయారు చేయడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అలాంటి శ్రమ లేకుండా.. అప్పటికప్పుడు కేవలం నిమిషాల్లో హెల్దీ దోశ చేసుకోవచ్చు.

Instant Dosa
ఉదయాన్నే దోశ తినాలంటే... ముందు రోజే పప్పు, బియ్యం నానపెట్టాలి. కనీసం ఐదు నుంచి ఆరు గంటలు అవి నానిన తర్వాత... పిండిలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత... ఆ పిండి కనీసం ఆరు గంటలైనా పులియబెట్టాలి. ఆ తర్వాత.. మనం దోశలు వేసుకోగలం. ఒకవేళ పప్పు నానపెట్టడం మర్చిపోతే.. మనం దోశలు వేసుకోలేం అనుకుంటారు. అంతేకాదు.. ఇన్ స్టాంట్ గా వేసుకునే దోశలు రుచిగా ఉండవు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ, కేవలం 20 నిమిషాల్లో టేస్టీగా, హెల్దీగా ఓట్స్ తో దోశ వేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
ఇన్ స్టాంట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు...
ఓట్స్: 1 కప్పు (లేదా ఓట్స్ పిండి)
బియ్యపు పిండి: అర కప్పు
బొంబాయి రవ్వ : పావు కప్పు
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినవి)
పచ్చి మిరపకాయ: 1 (సన్నగా తరిగినవి)
జీలకర్ర: అర టీస్పూన్
కొత్తిమీర: 1 టేబుల్ స్పూన్
నీరు: 2 నుండి 2½ కప్పులు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: దోసె కాల్చడానికి సరిపడా
అదనపు రుచి కోసం: తురిమిన క్యారెట్, కరివేపాకు లేదా చిటికెడు మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు.
దోశ పిండి తయారీ విధానం..
ముందుగా ఓట్స్‌ను మిక్సర్‌లో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి .మీ దగ్గర ఇప్పటికే ఓట్స్ పిండి ఉంటే నేరుగా వాడొచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఓట్స్ పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలపాలి. ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అయితే.. ఓట్స్, బొంబాయి రవ్వ నీటిని పీల్చుకోవడం వల్ల పిండి కొంచెం మందంగా మారుతుంది. కాబట్టి దోసె వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలిపి, అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి అడ్జస్ట్ చేయండి. పిండిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
దోశ వేసే విధానం...
నాన్-స్టిక్ లేదా ఇనుప పెనాన్ని మధ్యస్థ మంట మీద బాగా వేడి చేసి, కొద్దిగా నూనె రాయాలి. పెనం సరిగ్గా వేడెక్కకపోతే దోసె అంటుకుపోయి కరకరలాడదు. ఒకవేళ మీరు ఇనుప పెనం వాడుతుంటే, ప్రతి దోసెకు ముందు నూనె రాసిన ఉల్లిపాయ ముక్కతో పెనాన్ని తేలికగా తుడవండి. అప్పుడు దోశలు మంచిగా ఎర్రగా, పెనానికి అంటుకోకుండా వస్తాయి. దోసెను మరీ మందంగా కాకుండా పల్చగా వేస్తేనే బాగా కరకరలాడుతూ వస్తుంది. అంచుల వెంబడి కొద్దిగా నూనె వేసి, అడుగుభాగం బంగారు గోధుమ రంగులోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు మీడియం మంట మీద కాల్చాలి. అంటే.. ఈ దోశను ఏ చట్నీ తో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు.. ఈ ఓట్స్ దోశ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

