Sudha Murthy Relationship Tips ఆలుమగల అన్యోన్యత.. సుధామూర్తి సలహాలు!
ఆలుమగల మధ్య ప్రేమ, అన్యోన్యత బాగున్నప్పడే వారి సంసారం, భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు తరానికి మార్గం చూపే వైవాహిక జీవితం బాగుండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమగా ఉండాలి. మరి వైవాహిక జీవితం బలంగా ఉండాలంటే ఎలాంటి సలహాలు పాటించాలి? ఈ విషయం గురించి రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...

సుధా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి భార్య, వేల కోట్ల ఆస్తికి అధిపతి, రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవకురాలు. ఇలా ఎన్ని స్థానాలు ఉన్నా సుధా మూర్తి సింపుల్ గా ఉంటారు. జీవితం గురించి ఆమెకున్న అవగాహన అసాధారణమైనది. చాలా ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన మాటలు యువతకు ఆదర్శంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వివాహ వ్యవస్థ గురించి ఆమె గతంలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. మంచి భార్యాభర్తలు ఎలా ఉండాలో వివరించారు.
* భార్యాభర్తల మధ్య గొడవలు కామన్. ఇది ఒప్పుకోవాల్సిందే. మీ మధ్య ఎప్పుడూ గొడవలు జరగకపోతే మీరు నిజమైన భార్యాభర్తలు కాదని అర్థం చేసుకోవాలి.
* గొడవ జరిగినప్పుడు ఇద్దరిలో ఒకరు కూల్ అవ్వాలి. అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఆ గొడవ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా సైలెంట్ గా ఉండాలి, అందులో తప్పేం లేదు.
* పర్ఫెక్ట్ లైఫ్ ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే అది ఎప్పటికీ ఉండదు. పర్ఫెక్ట్ జోడీ అంటూ ఏదీ ఉండదు. ఒక వ్యక్తిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి.
* మగవాళ్ళు కిచెన్ లో భార్యకు హెల్ప్ చేయాలి. అది కేవలం ఆడవాళ్ళ పని అని అనుకోకూడదు. కనీసం సండే అయినా భార్యకు వంట చేయడానికి హెల్ప్ చేయండి, అది వాళ్ళకి హ్యాపీని ఇస్తుంది.
* వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే ఓపిక ఉండాలి. కుటుంబాన్ని కలిపి ఉంచడానికి కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి, కొన్ని సందర్భాల్లో ఓపికగా ఉండాలనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి.
* భార్యాభర్తలు ఫ్రెండ్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్లో నా మాటే వేదం, నేను చెప్పిందే జరగాలనే ఆలోచనల నుంచి బయటకు రావాలి.
* రిలేషన్స్ లో అహం విషం లాంటిది. ఒకరినొకరు సమానంగా చూసుకోవాలి. అధికారం కోసం ఎప్పుడూ పోటీ పడొద్దు. ఎవరి మాట చెల్లుతుంది అనే దానికంటే కుటుంబం సంతోషంగా ఉంటుందా లేదా అనేదానికి ప్రాముఖ్యం ఇవ్వాలి.