వర్షాకాలం ఇంట్లోకి పాములు రావొద్దంటే ఏం చేయాలో తెలుసా.? సింపుల్ టిప్స్
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలం ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షకాలంలో పాములు
వర్షాకాలం మొదలైన వెంటనే పాములు, తేళ్లు వంటి విషజీవులు ఇళ్ల చుట్టూ ఎక్కువగా కనిపిస్తాయి. వర్షం వల్ల నేల తడిగా మారడం, గూళ్లు దెబ్బతినడం, చీకటి ప్రదేశాలు పెరగడం వల్ల ఇవి బయటకు వచ్చి మన ఇళ్లలోకి చేరతాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. వర్షాకాలంలో పాములు ఎందుకు ఇళ్లలోకి వస్తాయి, వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో చూద్దాం.
పాములు ఇళ్లలోకి ఎందుకు వస్తాయి?
వర్షాకాలంలో నేల తడిగా మారి పాముల గూళ్లు కూలిపోతాయి. రక్షణ కోసం ఇవి బయటకు వస్తాయి. చీకటి, తేమ ఎక్కువగా ఉండే మూలల్లో ఇవి దాక్కుంటాయి. పాత చెక్కలు, రాళ్ల కుప్పలు, గోడల పగుళ్లు వంటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. నీరు నిలిచే ప్రదేశాల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
పాము ఇంట్లోకి వస్తే ఏం చేయాలి?
పాము ఇంట్లోకి వచ్చిందని గమనించిన వెంటనే భయపడి గోల చేయకూడదు. కర్రతో కొట్టడం, హింసించడం వల్ల పాము మరింత దాడి చేసే అవకాశం ఉంటుంది. దాని కదలికను దూరం నుంచి గమనించి, వెంటనే నిపుణులకు లేదా స్నేక్ క్యాచర్‌లకు సమాచారం ఇవ్వాలి. సాధారణంగా పాములు మనిషిని కారణం లేకుండా కాటు వేయవు, అవి తమకు ముప్పు ఉందని అనుకున్నప్పుడు మాత్రమే దాడి చేస్తాయి.
ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఇంటి చుట్టూ నీరు నిల్వ కాకుండా తరచూ శుభ్రం చేయాలి.
* డ్రైనేజ్ లైన్లను శుభ్రంగా ఉంచాలి.
* గోడల్లో పగుళ్లు ఉంటే వెంటనే మూసేయాలి.
* చెక్కల కుప్పలు, రాళ్ల గుట్టలు ఇంటి దగ్గర ఉంచరాదు.
* బాత్రూమ్, స్టోర్ రూమ్ వంటి ప్రదేశాల్లో ఎప్పుడూ వెలుగు ఉండేలా చూడాలి.
పాములు రాకుండా పాటించాల్సిన నేచురల్ టిప్స్
* వెల్లుల్లి, నిమ్మరసం కలిపిన నీటిని ఇంటి మూలల్లో స్ప్రే చేయాలి. దాని వాసన పాములు తట్టుకోలేవు.
* కర్పూరం, ఆవ నూనె కలిపిన మిశ్రమాన్ని మూలల్లో ఉంచితే పాములు దగ్గరకు రావు.
* బంతి పువ్వు మొక్కలు నాటితే వాటి వాసన వల్ల పాములు, తేళ్లు దూరంగా ఉంటాయి.
* వేపాకుల పొడి చల్లడం ద్వారా తేళ్లు, విషజీవులు దూరమవుతాయి.