- Home
- Life
- Republic day 2026 Speech: రిపబ్లిక్ డే రోజు ఇలా మాట్లాడి అదరగొట్టేయండి, ఇదిగో కొన్ని సింపుల్ స్పీచ్‌లు
Republic day 2026 Speech: రిపబ్లిక్ డే రోజు ఇలా మాట్లాడి అదరగొట్టేయండి, ఇదిగో కొన్ని సింపుల్ స్పీచ్‌లు
Republic day 2026 Speech: రిపబ్లిక్ డే వచ్చిందంటే పిల్లలు, ఉపాధ్యాయులు, నాయకులు స్పీచ్ ఇవ్వాల్సిందే. ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ మేము చాలా సులువైన పదాలతో రిపబ్లిక్ డే స్పీచ్ లను అందించాము. ఇందులో మీకు నచ్చినది ఎంపిక చేసుకోండి

స్పీచ్ 1
గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నా మిత్రులకు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతి ఏడాది మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంగా నిర్వహించుకుంటాం. మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే పాలించే విధానం ఈరోజే ప్రారంభమైంది. భారతదేశం ఒక స్వతంత్ర, గణతంత్ర దేశంగా మారింది. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ఎన్నో హక్కులు ఇచ్చింది. కుల,మత, భాషా, ప్రాంతం అనే తేడా లేకుండా అందరికీ సమాన గౌరవం కల్పించింది. ఇదే మన దేశానికి గొప్ప బలం. మన స్వాతంత్య్రం కోసం ఎంతో మంది వీరులు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను గుర్తుచేసుకొని దేశ అభివృద్ధికి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. చదువులో, నిజాయితీలో మనమే ముందుండాలి. అదే వారికి మనమిచ్చే గౌరవం.
జై హింద్
స్పీచ్ 2
అందరికీ నమస్కారం.
రిపబ్లిక్ డే వంటి రోజున మీ ముందు మాట్లాడే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది.
రిపబ్లిక్ డే అంటే కేవలం ఒక సెలవు రోజు కాదు. ఇది మన రాజ్యాంగ విలువలను గుర్తు చేసే రోజు. మన దేశం స్వేచ్ఛా, సమానత్వం అనే మూల సూత్రాలపై ఆధారపడి ఉంది. మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను ఇచ్చింది. ఎన్నో బాధ్యతలను నేర్పింది. దేశ చట్టాలను గౌరవించడం, జాతీయ జెండాను గౌరవించడం, దేశాన్ని గౌరవించడం పౌరులుగా మన కర్తవ్యం. విద్యార్థులమైన మనం మంచి పౌరులుగా ఎదగాలి. అబద్ధం, అవినీతి, హింసకు దూరంగా ఉండాలి. దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.
జై హింద్ జై భారత్.
స్పీచ్ 3
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ. ఇది మనకు గొప్ప బాధ్యత కూడా. దేశ అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వం చేసే పని కాదు. ప్రతి పౌరుడు చేయాల్సిన పని. ఏ పనైనా నిజాయితీగా చేస్తే అదే దేశ సేవ. కష్టపడడం, కొత్త ఆలోచనలు చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడమే ఈ దేశ పౌరులుగా మన మొదటి కర్తవ్యం. మన యువశక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలి. మన ఆలోచనలు బలంగా ఉంటే మన దేశం కూడా బలంగా ఉంటుంది.
జైహింద్.
స్పీచ్ 4
అందరికీ నమస్కారం.
ఈ గణతంత్ర దినోత్సవాన నా మనసులోని రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. దేశభక్తి అంటే జండా ఎగరేయడం కాదు. రోజూ మనం చేసే ప్రతి పనిలో దేశ గౌరవాన్ని కాపాడాలి. నిజమైన దేశభక్తిని చూపించాలి. చట్టాలను గౌరవించడం, ఇతరులను గౌరవించడం కూడా దేశసేవే. మన దేశం విభిన్న సంస్కృతులను కలిపిన అందమైన భూమి. ఈ వైవిధ్యమే మన బలం. భాషలు వేరైనా, మతాలు వేరైనా.. మనమంతా భారతీయులమే. దేశాన్ని ప్రేమించడమే మన మొదటి కర్తవ్యం. ఏదైనా మంచి మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి. ఈ గణతంత్ర ఉత్సవం మనందరిలో కొత్త లక్ష్యాలను నింపాలని కోరుకుంటూ...
జైహింద్ జై భారత్.

