- Home
- Life
- Lamb vs Mutton : మేక పిల్ల vs మేక పొట్టేలు.. రుచి, ఆరోగ్యంలో ఏది తోపు? మటన్ కొనేముందు తప్పక తెలుసుకోండి
Lamb vs Mutton : మేక పిల్ల vs మేక పొట్టేలు.. రుచి, ఆరోగ్యంలో ఏది తోపు? మటన్ కొనేముందు తప్పక తెలుసుకోండి
మటన్ ప్రియులకు ఓ డౌట్ ఎప్పుడూ ఉంటుంది. లేత మేకపిల్ల మాంసం, బలంగా ఉండే పొట్టేలు మాంసంలలో ఏది మంచిది? వాటి రుచి, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో తేడాలు ఏంటి? మాంసం నాణ్యతను మేక వయసు, పెంపకం ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం.

మేక పిల్ల vs మేక పొట్టేలు
ఆదివారం వచ్చిందంటే చాలు... మన తెలుగు ఇళ్లల్లో మాంసం ఉడకాల్సిందే.. ముక్క లేనిదే ముద్ద దిగదు. అందులోనూ మటన్ ప్రియుల ముచ్చటే వేరు. అయితే మటన్ షాపుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరినీ వేధించే పెద్ద డౌట్... "మేక పిల్ల మాంసం తీసుకోవాలా? లేక పొట్టేలు (పెద్ద మేక) మాంసం తీసుకోవాలా?" అని. కొందరు మెత్తగా ఉంటుందని మేక పిల్లను ఇష్టపడితే, మరికొందరు పక్కా నాటు రుచి కోసం పొట్టేలు వైపు మొగ్గు చూపుతారు. అసలు ఈ రెండింటిలో దేని రుచి బాగుంటుంది? ఆరోగ్యం పరంగా ఏది తింటే ఎక్కువ మేలు జరుగుతుంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మేక పిల్ల vs మేక పొట్టేలు.. దేని మాంసం రుచిగా ఉంటుంది?
లేత మేక మాంసం (Lamb)
సాధారణంగా ఏడాదిలోపు మేకపిల్లల నుంచి వచ్చే మాంసాన్ని లేత మాంసం అంటారు. ఇది పెద్ద మేక మాంసంతో పోలిస్తే చాలా మృదువుగా, మంచి రుచిగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు (fiber) తక్కువగా ఉండటం వల్ల నోట్లో వేస్తే కరిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇది త్వరగా ఉడుకుతుంది, మసాలాలను కూడా సులభంగా ముక్క లోపలికి పీల్చుకుంటుంది. కాబట్టి రుచి అదిరిపోతుంది.
పెద్ద మేక లేదా పొట్టేలు మాంసం (Mutton)
మనం సాధారణంగా మటన్ అని పిలిచేది ఇదే. ఇది రెండేళ్లు పైబడిన మేకల నుంచి వస్తుంది. లేత మాంసంతో పోలిస్తే ఇది కొంచెం గట్టిగా, ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. సాధారణంగా దావత్‌లు, పండగలకు ఎక్కువగా పొట్టేలు మాంసాన్నే ఇష్టపడతారు. ఈ మాంసం ముదురు ఎరుపు రంగులో, గట్టిగా ఉంటుంది.... ఇందులో కొవ్వు బాగా పేరుకుపోవడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన, ఘాటైన "నాటు రుచి" వస్తుంది. దీనితో వండే గ్రేవీ చాలా చిక్కగా, అద్భుతమైన రుచితో ఉంటాయి. అయితే ఇది ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
మేక పిల్ల vs మేక పొట్టేలు.. ఆరోగ్య ప్రయోజనాలు
లేత మేక మాంసం
చాలా తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది... సంతృప్త కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఈ మాంసం సులభంగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారికి ఇది ఉత్తమ ఎంపిక.
పెద్ద మేక లేదా పొట్టేలు మాంసం
మేక పొట్టేలు మాంసంలో హై ప్రోటీన్, ఐరన్ ఉంటాయి... అందుకే ఎదిగే పిల్లలకు, బాడీ బిల్డింగ్ చేసేవారికి ఇది ఒక పవర్‌హౌస్. ఇందులో జింక్, విటమిన్ B12కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి పొట్టేలు మాంసం రక్తాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని, బలాన్ని ఇస్తుంది.
మేక పిల్ల vs మేక పొట్టేలు మాంసం తేడాలివే..
మాంసం రూపం : మేక పిల్ల మాంసం చాలా మెత్తగా, జ్యూసీగా ఉంటుంది... మేక పొట్టేలు మాంసం గట్టిగా, నమలడానికి వీలుగా ఉంటుంది
ఉడికే సమయం : మేక పిల్ల మాంసం చాలా తక్కువ సమయంలో (త్వరగా) ఉడుకుతుంది. అదే మేక పొట్టేలు మాంసం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది (కుక్కర్ విజిల్స్ ఎక్కువ కావాలి)
కొవ్వు శాతం : మేక పిల్ల మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అదే పెద్ద మేక లేదా పొట్టేలు మాంసంలో ఎక్కువ ఉంటుంది.
జీర్ణక్రియ : చిన్న మేకపిల్ల మాంసం చాలా సులభంగా జీర్ణమవుతుంది. పెద్ద మేక మాంసం జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది.
ఏ వంటకు ఏది బెటర్ : మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ, మటన్ సూప్స్ కోసం లేత మాంసం బెటర్. అదే ఘాటైన గ్రేవీతో మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి కావాలంటే మాత్రం పెద్ద మేక మాంసం మంచిది.
మేక పిల్ల vs మేక పొట్టేలు.. ఏ మాంసం ఎలా మేలు చేస్తుంది?
మీరు కేవలం ఆరోగ్యం, తక్కువ క్యాలరీలు, సులభమైన జీర్ణక్రియను కోరుకుంటే "మేక పిల్ల మాంసం" అత్యుత్తమమైనది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ హెల్తీ ఆప్షన్.అయితే శరీరానికి మంచి బలం, రక్తం పట్టడం, ఎక్కువ ప్రోటీన్లు కావాలనుకుంటే "మేక పొట్టేలు మాంసం" మేలు చేస్తుంది. కానీ దీనిని లిమిట్‌గా తినడం మంచిది.

