ఇందుకే కారం ఎక్కువ తినాలనిపిస్తుందా..?
కొందరికి చప్పగా తినడం ఇష్టముంటే.. మరికొందరికి స్పైసీగా తినడం ఇష్టముంటుంది. కానీ కారం అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం తెలిసినా అలాగే తింటుంటారు. ఇలా తినడం వెనుక పెద్ద రీజనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

మనం తినే ఆహారాల్లో రకరకాల రుచులు ఉంటాయి. అందులో కొందరికి స్వీట్ నచ్చితే మరికొంతమంది స్పైసీ ఫుడ్ నచ్చుతుంది. నిజానికి కారం బరువును తగ్గించడం నుంచి ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అదికూడా మోతాదులో తీసుకుంటే. కానీ కొంతమంది కారం ఎక్కువగా తింటుంటారు. అయితే కొంతమంది మాత్రం జ్వరం వచ్చినప్పుడో, జలుబు చేసినప్పుడు మాత్రమే కారాన్ని ఎక్కువగా తింటుంటారు. ఇంకొంత మంది మాత్రం ఎప్పుడు కూడా కారంగానే ఉండే ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. దీనికి ఎన్నో కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రతిరోజూ స్పైసీగా ఉండే ఫుడ్ ను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది అజీర్థి, ఎసిడిటీ, ఇతర సమస్యలకు దారితీస్తుంది. అసలు ఎప్పుడూ కారంగా ఉండే ఆహారాలనే ఎందుకు తింటారో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రెగ్నెన్సీ
గర్భంతో ఉన్నప్పుడు రకరకాల రుచులను టేస్ట్ చేయాలనుకుంటారు. స్పైసీ ఫుడ్ ఒక్కటే కాదు. చాలా మంది గర్భిణీలు స్వీట్లను, చాక్లెట్లను, కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వీరి శరీరంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. లేదా ఇష్టమైన ఆహారాన్ని తినాలనే కోరిక వల్ల ఇలా అవుతుంది.
చల్లని వాతావరణం
వెదర్ కూల్ గా ఉన్నప్పుడు కూడా స్పైసీ, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలనిపిస్తుంది. చాలా కారంగా ఉండే ఆహారాలలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీరంలో వెచ్చదనం అనుభూతిని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు ఇది జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.
డిప్రెషన్
ఒక వ్యక్తి డిప్రెషన్ కు గురైనప్పుడు కూడా స్పైసీగా ఉండే ఆహారాలను తినాలనుకుంటాడట. ఆహారం యాంటి డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. నిరాశ తేలికపాటి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ దగ్గరకు వెళ్లమే మంచిది.
రినిటీస్
ఒక వేళమీరు రినిటీస్ సమస్యతో బాధపడుతున్నట్టైతే కూడా స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తింటారు. ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తుమ్ములు వంటివన్నీ రినిటీస్ లక్షణాలు. స్పైసీ ఫుడ్ ఈ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే వీళ్లు స్పైసీ ఫుడ్ ను తినడానికి ఇష్టపడతారు.
క్యాప్సైసిన్
మిరపకాయలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా మీకు స్పైసీ ఫుడ్ కావాలనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చిలో కనిపించే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం వల్ల స్పైసీ ఫుడ్ పై కోరికలు ఏర్పడతాయి.
వ్యక్తిత్వం
కొంతమందికి తీపి పదార్థాల కంటే కారంగా ఉండేవే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందుకే వీరు నచ్చిన పంటల్లో మసాలాలు బాగా వేసుకుని తింటుంటారు.