Heart Attack: దవడ నొప్పిని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది గుండెపోటుకు సంకేతం కావొచ్చు..!
Heart Attack: మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మన దేశంలో రోజు రోజుకు గుండె పోటు బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరగుతుంది. ఇలాంటి పరిస్థితిలో దీని సంకేతాలను ముందే గుర్తించడం చాలా అవసరం.

ఈ రోజుల్లో.. ముసలివాళ్లు, మధ్య వయస్కులు, యువత అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. గుండెపోటు బారిన పడుతున్నారు. అందుకే దీని బారిన పడకుండా ఉండేందుకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా దవడ నొప్పి కూడా 'తేలికపాటి గుండెపోటు'కు సంకేతం కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఛాతి నొప్పి (Chest pain), అసౌకర్యం, చెమట సమస్యలను తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇవన్నీ గుండెపోటు (Heart Attack)లక్షణాలు కావచ్చు. గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. దవడలో నొప్పి (Pain in the jaw)
దవడ వెనుక భాగంలో నొప్పి సమస్య తేలికపాటి గుండెపోటుకు సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు. దీనిలో నొప్పి దవడ నుంచి మొదలై మెడ వరకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి చాలా అకస్మాత్తుగా వస్తుంది. ఈ లక్షణాన్ని చాలా మంది గుర్తించరు.
2. చేతిలో జలదరింపు
చేతిలో నొప్పి (Pain) లేదా జలదరింపు (Tingling) వంటి అనుభూతి కలగడం తేలికపాటి గుండెపోటుకు సంకేతం. ఈ నొప్పి ఛాతీ, మెడ వరకు కూడా విస్తరించవచ్చు. ఈ రిస్క్ ను తేలికగా తీసుకోవడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. అకస్మాత్తుగా చెమట పట్టడం
రాత్రిపూట నిద్రలో మీకు ఉన్నట్టుండి విపరీతమైన చెమట పట్టడం కూడా గుండెపోటు (Heart Attack) లక్షణం కావచ్చు. అందుకే దీన్ని తేలిగ్గా తీసిపారేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకము
మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారా? ఇది మీ గుండె ఆరోగ్యం బాగాలేదని చెప్పే సంకేతం. ఇదీ కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకము , ఛాతి నొప్పి, గుండెపోటు సంకేతాలు. వీటినెప్పుడూ తేలిగ్గా తీసిపారేయకండి.
5. కడుపు నొప్పి: అనేక కడుపు సమస్యలు కూడా గుండెపోటుకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కడుపు నొప్పి ఇవన్నీ తేలికపాటి గుండెపోటు యొక్క లక్షణాలని వెల్లడిస్తున్నారు.
జంక్ ఫుడ్ ను అతిగా తీసుకోవడం, అధిక బరువు, ఊబకాయం, శరీరంలో కొవ్వు నిల్వలు, కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటీస్, స్మోకింగ్ వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.