ఆడవారిలో ఐరన్ లోపాన్ని పోగొట్టే సూపర్ ఫుడ్స్..
మెదడు సరైన అభివృద్ధికి, కండరాల కణజాలాలలో ఆక్సిజన్ నిల్వకు ఇనుము చాలా చాలా అవసరం. శరీరంలో ఖనిజం లోపిస్తే.. శరీరంలో రక్తం తగ్గడమే కాదు.. విపరీతమైన అలసట కూడా కలుగుతుంది.
ఇనుము లోపం వల్ల మన రక్తంలో తగినన్ని ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉండవు. మన శరీర కణజాలాలు ఎర్ర రక్త కణాల ద్వారే ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి ఇనుము అవసరం. ఇనుము ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. మగవారితో పోలిస్తే ఈ ఇనుము లోపం ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. నెలసరి ఎక్కువ రోజులు కావడం, గర్భం, పేలవమైన ఆహారం లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఆడవారిలో ఐరన్ లోపిస్తుంది. శరీంలో ఇనుము తక్కువ మొత్తంలో ఉండటం వల్ల మగత, శ్వాస ఆడకపోవడం, నాలుకపై పుండ్లు లేదా వాపు, మానసిక స్థితి మెరుగ్గా ఉండకపోవడం, క్రమరహిత నాడీ, పెళుసైన గోర్లు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని రకాల ఆహారాలు ఆడవారిలో ఐరన్ లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడతాయి. అవేంటంటే..
దుంపలు, క్యారెట్లు
ఆడవారిలో రక్తాన్ని పెంచడానికి దుంపలు, క్యారెట్లు బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం ఒక కప్పు తరిగిన బీట్ రూట్ ముక్కలు, కట్ చేసిన క్యారెట్లను తీసుకుని మిక్సీ పట్టండి. ఈ రసాన్ని వడకట్టి ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఈ అద్భుతమైన రసాన్ని ఉదయం పూట ప్రతిరోజూ తాగండి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఇనుము శోషణను పెంచుతుంది.
మునగ ఆకులు
మునగ ఆకుల్లో ఇనుము, విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 టీస్పూన్ మునగాకు పొడిని తీసుకుంటే ఇనుము లోపం పోతుంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు బాగా పెరుగుతాయి.
ఖర్జూరాలు, అత్తి పండ్లు, ఎండుద్రాక్ష
ఖర్జూరాలు, అత్తిపండ్లు, ఎండుద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిలో ఇనుము, మెగ్నీషియం, రాగి, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టిన 2 లేదా 3 ఖర్జూరాలు, 2 అత్తి పండ్లు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షలను అల్పాహారంగా తీసుకోండి. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి. అలాగే మీ శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతాయి.
గోధుమ గడ్డి
గోధుమ గడ్డిలో బీటా కెరోటిన్, విటమిన్ కె, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, ఇనుము, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో వివిధ రకాల రక్తాన్ని నిర్మించే కారకాలు కూడా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం పూట1 టీస్పూన్ దీనిని తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది.
నువ్వులు
నువ్వుల్లో ఇనుము, రాగి, జింక్, సెలీనియం, విటమిన్ బి 6, ఫోలేట్, విటమిన్ ఇ లు ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసి దీనిలో ఒక టీస్పూన్ తేనె, నెయ్యిని కలిపి లడ్డూల్లా చేయండి. ఈ లడ్డూలను తింటే మీ శరీరంలో ఇనుము స్థాయిలు బాగా పెరుగుతాయి.