Kitchen Hacks: కూరలో నూనె ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?
కేవలం ఉప్పు, కారం ఎక్కువ అయినప్పుడు మాత్రమే కాదు.. నూనె ఎక్కువ అయినా కూడా తినలేం. మరి.. ఈ కూరల్లో నుంచి అదనపు నూనెను ఎలా తొలగించాలో కచ్చితంగా తెలుసుకోవాలి.

cooking oil
వంట చేయడంలో ఎంత చెయ్యి తిరిగిన వాళ్లు అయినా... అప్పుడప్పుడు తెలీకుండానే తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కూరలో ఉప్పు, కారం లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటిని సరి చేయడానికి మన అందరి దగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి. కేవలం ఉప్పు, కారం ఎక్కువ అయినప్పుడు మాత్రమే కాదు.. నూనె ఎక్కువ అయినా కూడా తినలేం. మరి.. ఈ కూరల్లో నుంచి అదనపు నూనెను ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం...
1.ఐస్ క్యూబ్స్...
మీరు చేసిన గ్రేవీ కర్రీలో నూనె ఎక్కువగా ఉంటే.. ఐస్ క్యూబ్స్ వాడి.. సులభంగా నూనె తీసేయవచ్చు. ఒక పెద్ద గరిటె తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇప్పుడు ఆ గరిటెను కర్రీలో పైన తేలుతున్న నూనెపై ఉంచాలి. ఆ అదనపు నూనె మొత్తం.. ఆ గిరెటకు అంటుకుంటుంది. మీరు దానిని పక్కకు తీసేయవచ్చు. తర్వాత వేరే కర్రీకి వాడుకోవచ్చు.
ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
కూరలో నూనె ఎక్కువ అయ్యింది అని మీకు అనిపిస్తే.. ఆ నూనెతో కూడిన ఆహారాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. చల్లగా ఉండటం వల్ల నూనె గట్టిపడుతుంది. అలా గట్టిపడిన దానిని.. స్పూన్ సహాయంతో తీసేయవచ్చు.
బ్రెడ్ స్లైస్
గ్రేవీ లేదా కూరపై ఒక ముక్క బ్రెడ్ వేసి ఒక నిమిషం ఉంచండి. బ్రెడ్ అదనపు నూనెను పీల్చుకుంటుంది. తరువాత బ్రెడ్‌ను తీసేయండి. ఇది ముఖ్యంగా కూరలలో, పప్పులో బాగా పనిచేస్తుంది.
కాకరకాయ ముక్కలు
కాకరకాయ ముక్కలకు కూడా అదనపు నూనెను పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి. వీటిని తాత్కాలికంగా వేసి, కొన్ని నిమిషాల తర్వాత తీసేస్తే కూరలో నూనె తగ్గుతుంది.
స్టీల్ స్పూన్‌తో తీసేయడం
గ్రేవీపై తేలియాడుతున్న నూనెను స్టీల్ స్పూన్ లేదా సూప్ లాడిల్‌తో నెమ్మదిగా తీసేయండి. ఇది సులభమైన , తక్షణ పరిష్కారం.
తేలికైన వంటకాలు చేయడం
మొదటి నుంచే తక్కువ నూనె వేసే అలవాటు చేసుకోవడం ఉత్తమం. వేపుడు లేదా గ్రేవీ కూరల్లో నాన్-స్టిక్ పాన్ ఉపయోగిస్తే తక్కువ నూనెతోనే వంట రుచికరంగా అవుతుంది.
ముందుగానే ఐస్ వాటర్ టెక్నిక్
వంట పూర్తి అయిన తర్వాత కూరలో ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఐస్ నీరు పోసి మూత పెట్టండి. కొద్ది సేపట్లో చల్లదనం కారణంగా నూనె గిన్నె చుట్టూ చేరుతుంది. తర్వాత దానిని సులభంగా తీసేయవచ్చు.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
నూనె ఎక్కువగా వాడకుండా వంట చేసేందుకు వంటలో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆవ నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను పరిమిత మోతాదులో వాడడం మంచిది. అలాగే కూరల్లో పాలు, పెరుగు లేదా టమోటా ప్యూరీ వేసినా తక్కువ నూనెతోనే మంచి రుచి వస్తుంది.