Skin Care: స్కిన్ కేర్ లో ఈ చిన్న తేడా ఎప్పుడైనా గమనించారా?
Skin Care: చర్మం పొడిబారుతోందని మాయిశ్చరైజర్ రాస్తున్నారా? అయినా కాసేపటికే పొడిగా, గట్టిగా అనిపిస్తోందా? సమస్య చర్మంలో తేమ లేకపోవడం కాదు. చర్మానికి తేమ ఎంత ముఖ్యమో, తేమ బయటకు పోకుండా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ?

చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ రెండూ అవసరమే
చాలామంది హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ వీటి పనితీరు వేర్వేరుగా ఉంటుంది. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ వంటి పదార్థాలు చర్మంలోకి తేమను పీల్చుకోవడంలోసహాయపడతాయి. వీటిని హైడ్రేటింగ్ పదార్థాలు అంటారు. మరోవైపు నేచురల్ ఆయిల్స్, షియా బటర్ వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు తేమ త్వరగా ఆవిరైపోకుండా అడ్డుకుంటాయి. వీటిని మాయిశ్చరైజింగ్ పదార్థాలుగా చెప్పొచ్చు.
అయితే ఈ రెండింటి ప్రయోజనం సరిగ్గా అందాలంటే చర్మంలోని రక్షణ పొర ఆరోగ్యంగా ఉండాలి. దీనినే స్కిన్ బ్యారియర్ అంటారు. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచడంతో పాటు దుమ్ము, కాలుష్యం, ఇతర హానికరమైన బాహ్య కారకాల నుంచి రక్షిస్తుంది.
స్కిన్ బ్యారియర్ ఎందుకు దెబ్బతింటుంది?
ముఖాన్ని తరచూ కడుక్కోవడం, గట్టిగా పనిచేసే క్లెన్సర్లను ఉపయోగించడం, అతిగా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మంలోని సహజ రక్షణ పొర దెబ్బతినే అవకాశం ఉంది. స్కిన్ బ్యారియర్ బలహీనపడితే చర్మంలో ఉన్న తేమ వేగంగా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ముఖం పొడిబారడం, బిగుతుగా అనిపించడం, చర్మం పొట్టు రాలడం, చికాకు వంటి సమస్యలు కనిపించవచ్చు.
చర్మ రక్షణ పొరను తిరిగి ఆరోగ్యంగా ఉంచడానికి సెరమైడ్స్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పదార్థాలు ఉపయోగపడతాయి. ఇవి స్కిన్ బ్యారియర్ నిర్మాణానికి అవసరమైన కీలక భాగాలు. అలాగే నియాసినమైడ్ కూడా చర్మ రక్షణ వ్యవస్థకు తోడ్పడటంతో పాటు చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా చర్మానికి తగినంత హైడ్రేషన్ అందుతుందని అనుకోకూడదు. ముఖ్యంగా కాలుష్యం, ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే మాయిశ్చరైజర్‌లోని పదార్థాలను కూడా పరిశీలించాలి.
హైడ్రేషన్‌తో పాటు స్కిన్ బ్యారియర్‌ను బలంగా ఉంచే ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి. ముఖం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాస్తే తేమ నిలుస్తుంది. అలాగే చర్మాన్ని అతిగా శుభ్రం చేసే క్లెన్సర్లకు దూరంగా ఉండాలి. ముఖం కడిగిన తర్వాత మరీ బిగుతుగా, పొడిగా అనిపిస్తే ఉపయోగిస్తున్న క్లెన్సర్ మీ చర్మానికి సరిపోవడం లేదేమో గమనించాలి.
ఎప్పుడు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి?
మాయిశ్చరైజర్ రాసినప్పటికీ చర్మం పొడిబారడం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఎర్రబడటం, దురద, పగుళ్లు, మంట వంటి లక్షణాలు కూడా ఉంటే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని చర్మ సమస్యలకు క్రీములు మాత్రమే సరిపోవు.










