ఎంత పసుపు పచ్చని దంతాలైనా సరే.. ఇలా చేస్తే ముత్యాల్లా మెరవాల్సిందే..!
దంతాలు పసుపు పచ్చగా కావడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ వీటిని తిరిగి తెల్లగా చేయడం కష్టంగా అనిపిస్తుంది చాలా మందికి. నిజానికి కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ దంతాలు తెల్లగా, ముత్యాల్లా మెరిసిపోతాయి.

teeth
నవ్వుతోనే ముఖం అందంగా కనిపిస్తుంది. మీ అందాన్ని రెట్టింపు చేయడానికి ముత్యాల్లాంటి దంతాలు ఎంతో సహాయపడతాయి. నిజానికి దంతాలు తెల్లగా ఉంటేనే మనస్ఫూర్తిగా నవ్వుతారు. పసుపు రంగులో దంతాలుండే వారు నోటికి చేతిని అడ్డం పెట్టుకుని నవ్వుతుంటారు. నిజానికి దీనివల్ల నలుగురిలో మాట్లాడటానికి కూడా వెనకాడుతుంటారు. కారణం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారేమోనని. సరిగ్గా బ్రష్ చేయకపోయినా కానీ దంతాలు పచ్చగా ఉంటాయి. ఇంకొందరు రోజూ సరిగ్గా బ్రష్ చేసినా పసుపు పచ్చగానే ఉంటాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని హోం రెమిడీస్ తో పసుపు పచ్చ దంతాలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
దంతాలు పసుపు పచ్చగా కావడానికి కారణాలు
దంతాలు పసుపు రంగులోకి మారడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్మోకింగ్, సరిగ్గా తినకపోవడం, నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. ఎంతకీ దంతాలను ఎలా తెల్లగా చేయాలంటే..
వేప పుల్ల
వేప మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ బ్రష్ కు బదులుగా వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకుంటే మంచిది. దీనివల్ల మీ దంతాలపై పసుపు రంగు మాయమైపోతుంది. అంతేకాదు మీ దంతాలు తలతల తెల్లగా మెరిసిపోతాయి కూడా.
అరటి తొక్క
అరటి తొక్క ముఖాన్ని అందంగా చేయడమే కాదు.. దంతాలను శుభ్రం చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా అరటితొక్క ను వొలిచి తొక్క లోపలి భాగాన్ని మీ దంతాలపై బాగా రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో దంతాలను కడిగితే సరి. తరచుగా ఇలా చేయడం వల్ల మీ దంతాలకున్న పసుపు రంగు పోతుంది. దంతాలు తెల్లగా మెరుస్తాయి.
స్ట్రాబెర్రీలు
పసుపు దంతాలను తెల్లగా మార్చడానికి స్ట్రా బెర్రీలు కూడా ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం స్ట్రాబెర్రీలను తీసుకుని పచ్చగా ఉండే దంతాలపై రుద్దండి. స్ట్రాబెర్రీలు దంతాలను శుభ్రపరుస్తాయి. స్ట్రాబెర్రీలను తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది
నిమ్మతొక్కలు
నిమ్మ తొక్కలు పసుపు పచ్చని దంతాలను తెల్లగా మార్చడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.. ఎందుకంటే నిమ్మకాయలో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి మీ దంతాలపై ఉండే పసుపు పచ్చ రంగును వదిలిస్తాయి. ఇందుకోసం నిమ్మతొక్కలను తీసుకుని దంతాలకు రుద్దండి. లేదా నిమ్మరసాన్ని నీళ్లలో మిక్స్ చేసి దాన్ని నోట్లో పోసి పుక్కిలించండి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా మీ పళ్లను మరింత తెల్లగా చేస్తుంది. ఇందుకోసం అరచెంచా బేకింగ్ సోడాను తీసుకుని.. దానిలో కొంచెం టూత్ పేస్ట్ ను కలపండి. దీంతోనే రెగ్యులర్ గా బ్రష్ చేసుకోండి. దీనివల్ల మీ పళ్లపై ఉండే గార ఇట్టే వదులుతుంది. రోజుకు రెండు సార్లు దీనిలో బ్రష్ చేస్తే కొన్ని రోజుల్లో మీ దంతాలు తెల్లగా మారిపోతాయి.