Divorce:ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కారణంగా భార్యభర్తలు విడిపోతున్నారా?
Divorce: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడేవారే. మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ వాడేవాళ్లు చాలా ఎక్కువ అవుతున్నారు. ఈ సోషల్ మీడియా యాప్ కారణంగా భార్యభర్తలు విడిపోతున్నారు అంటే మీరు నమ్మగలరా? సర్వేలు అదే చెబుతున్నాయి.

Divorce
ఇన్ స్టాగ్రామ్ ని చాలా మంది కేవలం రీల్స్ చూడటానికి మాత్రమే వాడేవారు చాలా మంది ఉన్నారు. రీల్స్ చూడటం మొదలుపెడితే.. ఆపలేక.. దానికి అడిక్ట్ అవుతున్న వారు కూడా ఉన్నారు.కానీ.. ఈ రీల్స్ ఎక్కువ మంది భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అవుతుందని అనేక సర్వేలు, న్యాయ నిపుణులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. దీని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం...
1.వర్చువల్ ప్రపంచంతో పోలిక.. (The Comparison Trap)
రీల్స్ లో చాలా మంది తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి వీడియోలు చేసి షేర్ చేసుకుంటున్నారు. ఆ రీల్స్ ని చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతూ ఉంటారు. రీల్స్ లో ఇతరులు జీవితం ఎంత అందంగా ఉందో, భర్త ఎన్ని సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇస్తున్నారో చూపిస్తూ ఉంటారు. ఇది చూసిన వారు ‘ నా భార్య/ భర్త ఎందుకు ఇలా లేరు?’ అని తమ భాగస్వామితో పోల్చుకోవడం మొదలుపెడతారు. ఈ అసంతృప్తి కాస్తా గొడవలకు దారి తీస్తుంది.
2.సమయం కేటాయించకపోవడం...( Digital Distraction)
భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చొన్నా, ఎవరి ఫోన్లలో వారు రీల్స్ చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి, మానసిక దూరం పెరుగుతోంది.
3.ప్రైవసీ లేకపోవడం, వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పేయడం..
కొంత మంది రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో తమ క్రేజ్ పెంచుకోవడానికి తమ ఇంటి విషయాలను, గొడవలను లేదా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. ఇది మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. దీని వల్ల ఒకరి మీద మరొకరికి గౌరవం తగ్గి, మనస్పర్థలు వస్తున్నాయి. ఫలితంగా గొడవలకు దారితీస్తోంది.
4. అనుమానాలు, అక్రమ సంబంధాలు
రీల్స్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడటం, పాత స్నేహితులతో చాటింగ్ చేయడం వంటివి సులభమయ్యాయి. లైక్స్, కామెంట్స్ రూపంలో మొదలయ్యే పరిచయాలు కొన్నిసార్లు వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి, ఇది నేరుగా విడాకుల వరకు వెళ్తోంది.
5. రీల్స్ కోసం విలాసవంతమైన ఖర్చులు
రీల్స్ లో అందంగా కనిపించాలని, ట్రెండింగ్ లో ఉండాలని ఖరీదైన బట్టలు, మేకప్, అనవసరమైన ట్రిప్పుల కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి, కుటుంబంలో గొడవలు మొదలవుతున్నాయి.
పరిష్కారం ఏమిటి?
సోషల్ మీడియా అనేది ఒక వినోద సాధనం మాత్రమే, అది జీవితం కాదని గుర్తించాలి.
నో ఫోన్ టైమ్: భోజనం చేసేటప్పుడు లేదా నిద్రపోయే ముందు ఫోన్లు పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి.
పోలిక వద్దు: రీల్స్ లో కనిపించేవన్నీ నిజం కావని, అవి కేవలం 'ఎడిట్' చేసిన క్షణాలు మాత్రమేనని అర్థం చేసుకోవాలి.
ప్రైవసీ: ఇంటి విషయాలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం మంచిది.
ఫైనల్ గా చెప్పేది ఒక్కటే.. సోషల్ మీడియాను పరిమితంగా వాడితే అది ఆనందాన్ని ఇస్తుంది, కానీ దానికి బానిసలైతే అది అందమైన సంసారాన్ని ముక్కలు చేస్తుంది.

