Insects: బయట నిగనిగలాడుతూ.. లోపల పురుగులు, రంధ్రం లేకుండా పండులోకి పరుగులు ఎలా వెళ్తాయి?
Insects: చాలా రకాల పండ్లు బయట చూడటానికి మంచిగానే కనిపిస్తాయి. కానీ.. తిందామని కోసి చూస్తే... అందులో నుంచి పురుగులు కనిపిస్తూ ఉంటాయి. అసలు.. పండులోకి పురుగులు ఎలా వచ్చాయి..?

పండులోకి పురుగులు ఎలా వచ్చాయి?
మార్కెట్ లో మంచిగా నిగనిగలాడుతూ ఉండే పండ్లను ఏరి మరీ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. తీరా ఇంటికి తెచ్చుకున్న తర్వాత... ఆశగా తిందాం అని కట్ చేస్తే... లోపల పురుగులు కనిపిస్తే... ఎలా ఉంటుంది? పండు బయటకు మాత్రం మంచిగా ఉన్నా... పండు లోపలికి పురుగులు ఎలా వచ్చాయో చాలా మందికి అర్థం కాదు. పండు పైన ఎలాంటి గాయం, రంథ్రాలు కూడా లేకుండా.. పండులోకి పురుగులు ఎలా పుట్టుకువస్తాయి..? దీని వెనక కారణం ఏంటో తెలుసా?
కీటకాల దాడి..
పండు చెట్టుపై పండిన తర్వాత పురుగులు లోపలికి వెళ్లవు. అసలు కథ అంతా పండు చిన్న పిందెగా లేదా కాయగా ఉన్నప్పుడే మొదలవుతుంది. 'ఫ్రూట్ ఫ్లైస్' అనే ప్రత్యేక జాతి ఈగలు లేత కాయలపై వాలి, తమ శరీరంలో ఉండే సూది లాంటి సన్నని అవయవంతోకాయ తొక్కను గుచ్చి లోపలికి గుడ్లు పెడతాయి. ఆ సమయంలో ఆ రంధ్రం మన కంటికి కూడా కనిపించనంత చిన్నగా ఉంటుంది.
2. గాయాన్ని మాన్పుకునే పండు తొక్క
మన శరీరానికి చిన్న గాయమైతే చర్మం ఎలాగైతే కొద్దిరోజులకు మానిపోయి మచ్చ లేకుండా మారుతుందో, చెట్టుపై ఉన్న కాయ కూడా అలాగే పనిచేస్తుంది. కీటకం గుడ్డు పెట్టినప్పుడు తొక్కపై పడ్డ ఆ సూక్ష్మ రంధ్రం.. కాయ పెరిగి పెద్దదయ్యే కొద్దీ, దానిలోని కణజాలం వృద్ధి చెంది పూర్తిగా పూడిపోతుంది. అందువల్ల పండు పూర్తిగా పండిన తర్వాత బయటికి ఎలాంటి రంధ్రం గానీ, పురుగు వెళ్లిన ఆనవాలు గానీ అస్సలు కనిపించవు.
లోపల గుజ్జును తింటూ పెరిగే లార్వాలు
పండు లోపల ఎంతో భద్రంగా ఉన్న ఆ కీటకం గుడ్లు, కొన్ని రోజులకు పగిలి చిన్న పురుగులుగా మారుతాయి. బయటి వాతావరణం నుండి ఎలాంటి ప్రమాదం లేకుండా, పండు లోపల ఉండే తియ్యని గుజ్జునే ఆహారంగా తింటూ అవి క్రమంగా పెద్దవవుతాయి. మనం ఆ పండును కత్తితో కోసే వరకు అవి లోపలే ఉండి, కట్ చేయగానే బయటపడతాయి.
4. కాడ భాగం ద్వారా ప్రవేశం కొన్ని సందర్భాల్లో పండ్లపై ఉండే అతి సూక్ష్మమైన సహజ రంధ్రాలు లేదా పండు చెట్టుకు అతుక్కుని ఉండే కాడ భాగం దగ్గర ఉండే చిన్న పగుళ్ల ద్వారా కూడా కీటకాలు లోపలికి ప్రవేశించి గుడ్లు పెడుతుంటాయి.
కాబట్టి, పండు బయటికి ఎంత అందంగా, మచ్చలేకుండా ఉన్నప్పటికీ.. అది పిందె దశలో ఉన్నప్పుడు కీటకాల బారిన పడితే లోపల పురుగులు ఏర్పడటం చాలా సహజం. అందుకే పండ్లను కొనేటప్పుడు మరీ మెత్తగా ఉన్నవి కాకుండా, కాస్త గట్టిగా ఉన్నవి చూసి తీసుకోవడం, కోసిన తర్వాతే తినడం ఎల్లప్పుడూ సురక్షితం.













