Mosquitoes: కలబంద, తులసి, వేప చెట్లు ఇంటి చుట్టూ ఉంటే దోమలు రావా?
ఈ మధ్య కాలంలో దోమల బాధ బాగా ఎక్కువైపోయింది. పగలు లేదు. రాత్రి లేదు. ఎప్పుడు పడితే అప్పుడూ కుట్టి కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలను ఇంట్లో నుంచి తరిమి కొట్టేందుకు ఎన్ని చేసినా.. అవి సేఫ్ గా ఎక్కడో ఓ మూల దాక్కుంటున్నాయి. మరి వాటి బాధనుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నారా? ఆలస్యమెందుకు ఇది చూసేయండి.

ఇంట్లో దోమలు ఎక్కువైతే.. ప్రశాంతంగా కూర్చోలేము. నిద్రపోలేము. అవి కుట్టి కుట్టి రక్తాన్ని తాగేస్తూనే ఉంటాయి. సాధారణంగా దోమలను ఇంట్లో నుంచి బయటకు పంపియ్యడానికి చాలామంది దోమలబత్తి లాంటి కెమికల్స్ వాడుతుంటారు. ఇవి దోమలను చంపుతాయి కానీ, మన ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయంటున్నారు నిపుణులు. మరి దోమలను సహజంగా ఇంట్లో దొరికే పదార్థాలతో ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్పూరం:
దోమలను తరిమికొట్టడానికి దోమలబత్తిని వాడే బదులు, సాయంత్రం ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసి వేప ఆకుల్లో కర్పూరం వేసి వెలిగించాలి. వాటి నుండి వచ్చే పొగను ఇల్లు అంతా వ్యాపించేలా చూసుకోవాలి. ఇలా చేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
సాంబ్రాణి:
సాంబ్రాణి ఇంటికి సువాసనను ఇవ్వడమే కాకుండా దోమలను తరిమికొట్టడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసి, సాంబ్రాణి పొగ ఇల్లు అంతా వ్యాపించేలా చేయండి. ఇలా చేస్తే ఇల్లు సువాసనగా ఉండటమే కాకుండా, దోమల బాధ కూడా తప్పుతుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లి వంటలకు మాత్రమే కాకుండా దోమలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటి నుంచి వచ్చే వాసన దోమలను ఇంటి నుంచి తరిమికొడుతుంది. దీనికోసం 4-5 వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి, దానికి కొద్దిగా నూనె, కర్పూరం కలిపి వెలిగిస్తే చాలు. వాటి పొగ ఇల్లు అంతా వ్యాపించి దోమలు చనిపోతాయి.
కలబంద:
మీ ఇంటి చుట్టూ తులసి, వేప, కలబంద వంటి మొక్కలు ఉంటే దోమలు రావట. అంతేకాకుండా కలబంద దోమ కాటుకు మందుగా ఉపయోగపడుతుంది. దోమ కుట్టిన చోట కలబంద జెల్ రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులు, వేప ఆకులను పేస్ట్‌లా నూరి దోమ కుట్టిన చోట రాస్తే దురద, దద్దుర్లు రావు.
పుదీనా నూనె:
ఇంట్లో నుంచి దోమలను తరిమికొట్టడానికి పుదీనా నూనె చాలా బాగా పని చేస్తుంది. దీనికోసం ఒక స్ప్రే బాటిల్‌లో వాటర్ కలిపి, దానికి కొన్ని చుక్కల పుదీన నూనెను కలిపి ఇల్లంతా చల్లాలి. వాటి వాసన భరించలేక దోమలు ఇంటి నుంచి పారిపోతాయి.