మన వంటింట్లో.. మన ఆరోగ్యాన్ని సైలెంట్ గా దెబ్బతీసే ఆహారాలుంటాయి జర జాగ్రత్త..
ఇంట్లో వండిన ఆహారం పూర్తిగా సేఫ్.. దీన్ని తింటే ఎలాంటి రోగాలు రావని చెప్పుకునే వారు చాలా మందే ఉన్నారు. నిజమేంటంటే.. వంటింట్లో కొన్ని ఆహారాలు బయటి ఫుడ్ కంటే దారుణంగా మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి..

మన వంటింట్లో అన్నిరకాల వంటలకు అవసరమయ్యే సరుకులను ఎక్కువగా కొంటుంటాం. ఇలాంటివి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి. ఇంతకీ మన వంటింట్లో మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలేంటో తెలుసుకుందాం పదండి..
Image: Getty Images
చక్కెరచక్కెరను ఒక్కటేమిటీ.. టీ, కాఫీ, పాయసం, జ్యూస్, మిల్క్ షేక్, రకరకాల తీపి పదార్థాలంటూ ప్రతి దానికి ఉపయోగిస్తాం. అందుకే దీన్ని అన్ని సరుకుల కంటే ఎక్కువగా కొంటుంటారు. కానీ దీనివల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలు కంటే అనర్థాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చక్కెరను ఎక్కువగా తీసుకోవడడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీర మంట ఎక్కువ అవుతుంది. బరువు పెరుగుతారు. మధుమేహం వస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. అంతేకాదండోయ్.. ఇవన్నీ కలిసి మీకు స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చేలా చేస్తాయి మరి.
శుద్ధి చేసిన పిండి
మైదా శుద్ధి చేసిన పిండే. ఇది ప్రతి వంటగదిలో తప్పకుండా ఉంటుంది. కేకులు, కుకీలు, బ్రెడ్, పాస్తాలు అంటూ చాలా ఆహారాల్లో మైదా ఉంటుంది. దీనిని చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తారు కూడా. కానీ శుద్ధి చేసిన పిండిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల బరువు పెరుగుతారు. జీవక్రియ సమస్యలొస్తాయి. గుండెకు సంబంధించినన సమస్యలు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. శుద్ధి చేసిన పిండిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఫైబర్, విటమిన్ బి, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ ఇ లను తగ్గిస్తుంది.
ఉప్పు
ఉప్పును ఎక్కువగా తీసుకోవడడం వల్ల రక్తపోటు, గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. చాలా మంది రోజుకు సగటున 9 నుంచి 12 గ్రాముల ఉప్పును లేదా సిఫారసు చేసిన స్థాయిల కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉప్పును తీసుకుంటుంటారు. సోడియాన్ని తీసుకునే స్థాయిలను తగ్గిస్తే మరణ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
నూనె
చాలా మంది నూనెలో వేయించిన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. ఇక కొందరైతే పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహారాలను ప్రతి రోజూ తింటుంటారు. కానీ ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, బరువు పెరగడం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
చివరగా..
నూనె, ఉప్పు, లేదా ఇతర ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. అంటే వీటిని మోతాదులోనే తీసుకోవాలన్న మాట. శుద్ధి చేసిన మైదా పిండికి బదులుగా రాగుల పిండి, గోధుమల పిండి వంటి ఆరోగ్యకరమైన, ఫైబర్ ఎక్కువగా ఉండే పిండిలను ఉపయోగించండి. చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించండి. ఈ చిన్న చిన్న మార్పులే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు బతికేలా చేస్తాయి.