చలికాలంలో నల్ల మిరియాలను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇవి చలికాలంలో దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయి.

black pepper
నల్ల మిరియాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మసాలా దినుసులను వంటలకు జోడించడం వల్ల రుచి అదిరిపోతుంది. అంతేకాదు ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. నిజానికి చలికాలంలో నల్ల మిరియాలను రోజూ తినాలి. ఎందుకంటే ఇవి ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు మొదలైన అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని రక్షిస్తాయి. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంటువ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి. నల్ల మిరియాల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా మన రోగనిరోధక శక్తిని పెంచే అద్బుతమైన యాంటీ బయోటిక్. అసలు ఈ సీజన్ లో నల్ల మిరియాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియకు సహాయపడుతుంది
నల్ల మిరియాలు పచ్చిగా తినడం వల్ల కడుపు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ హైడ్రోక్లోరిక్ మీ ప్రేగులను శుభ్రం చేస్తుంది. దీంతో ఎన్నో జీర్ణశయాంతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే మీరు తినే ప్రతిదానిపై కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ ను చల్లడం మర్చిపోకండి.
మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
వారంలో మూడు సార్ల కంటే తక్కువ సార్లు మలవిసర్జన చేస్తున్నట్టైతే మీరు మలబద్దకం సమస్య బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి. మలబద్దకం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే క్రమం తప్పకుండా మోతాదులో నల్ల మిరియాలను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి సులువుగా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
గ్రీన్ టీలో నల్లమిరియాలను వేసుకుని ప్రతిరోజూ రెండు మూడు సార్లు తాగితే మీరు ఊహించని విధంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ మసాలా దినుసులో అధిక మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి అదనపు కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతాయి. ఇవి మీ శరీర జీవక్రియను కూడా పెంచుతాయి.
కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి
ఆర్థరైటిస్ ను పూర్తిగా తగ్గించేకోలేం. కేవలం నొప్పిని మాత్రమే తగ్గించుకోవచ్చు. అయితే ఈ కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు ఈ చలికాలంలో మరీ ఎక్కువగా అవుతుంటాయి. అయితే నల్ల మిరియాలు ఈ నొప్పులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎందుకంటే మిరియాల్లో ఈ సమస్యను తగ్గించే ఔషధ లక్షణాలు ఉంటాయి. వెన్నెముక నొప్పి ఉన్నవారికి కూడా ఇవి సహాయపడతాయి.
బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెరుగుపరుస్తాయి
నల్ల మిరియాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహులకు ఔషదంలా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి వీరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి భోజనంపై నల్ల మిరియాల పొడిని చల్లుకుని తినొచ్చు. ఇన్సులిన్ సున్నితత్వం విషయానికి వస్తే ఈ అద్భుతమైన మసాలాను రోజూ తీసుకుంటే మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
శ్లేష్మం నుంచి ఉపశమనం
నల్ల మిరియాలు మన శరీరంలో శ్లేష్మం ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది దగ్గు (శ్లేష్మ పదార్థం) ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చలికాలంలో శ్లేష్మం సమస్య ఎక్కువగా బాధపెడుతూ ఉంటుంది. అందుకే నల్ల మిరియాలను తీసుకోండి. మంచి ఉపశమనం పొందుతారు.
కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అయితే నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. నల్లమిరియాల్లో ఉండే పైపెరిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిరూపించబడింది. పైపెరిన్ ద్వారా శోషించుకునే ఆహార పదార్ధాల సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.