Mother’s Day 2022: మదర్స్ డే రోజున ఇలా చేస్తే మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది.. తెలుసా..
Mother’s Day 2022: కలిసి బేకింగ్ చేయడం, ఒక రోజు ముందుగా సెలవు పెట్టడం, మీ అమ్మకోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేయడం.. వంటివి మీ అమ్మను ఎంతో సంతోషపెడతాయి.

Mother’s Day 2022: ఈ భూమ్మీద తల్లిని మించిన దైవం మరోటి లేదు. కనిపించే అమ్మే అసలైన దైవం. మనం కోరుకోకుండానే మన కోసం ఎన్నో చేస్తుంది. మన ప్రాణాలకు తన ప్రాణం అడ్డు పెడుతుంది. అలాంటి అమ్మ ప్రేమకు మనమందరం దాసోహం కావాల్సిందే. అమ్మ ప్రేమ, ఆరాధన, ఆప్యాయత, అనురాగం ఇవి కోట్లు ఖర్చుపెట్టినా కొనలేరు. నేనంటూ ఒకదాన్ని ఉన్నా ..నా కోసం ఏమైనా చేయాలి.. అన్న ఆలోచనే ఉండని నిస్వార్థపరురాలు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. అలాంటి మహామూర్తిగా ఎన్ని పాదాభివందనాలు చేసినా తక్కువే.
అమ్మప్రేమకు, కష్టానికి, సేవకు, ఆరాధనకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఐదో నెల రెండో ఆదివారం (మే 8న)మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ రోజున మీ అమ్మను సర్ ప్రైజ్ చేయడానికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీయ-ప్రేమ.. ఏ తల్లైనా సరే తన కుటుంబం గురించే ఆలోచిస్తుంది. కానీ తన గురించి తాను మాత్రం పట్టించుకోదు. ఒకరకంగా చెప్పాలంటే మేమంటూ ఒకరము ఉన్నామన్న సంగతే మర్చిపోయి ఇంటి పనుల్లో మునిగిపోతుంటారు. అందుకే మదర్స్ డే నాడు మీ అమ్మను అలా బయటకు తీసుకెళ్లండి. పెడిక్యూర్, మానిక్యూర్ చేయించండి. ఈ తర్వాత మంచి స్పా కోసం తీసుకెళ్లండి. ఆ తర్వాత హెయిర్ కట్ లేదా హెయిర్ కలర్ ను వేయించండి. దీంతో మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది.
ముందస్తు సెలవు పెట్టండి.. మదర్స్ డే సందర్బంగా మీ అమ్మకు చెప్పకుండా ఆఫీస్ కు లీవ్ పెట్టి ఎటైనా విహారయాత్రకు ప్లాన్ చేయండి. మీ అమ్మ బ్యాగ్ ను మీరే ప్యాక్ చేసి అందమైన ప్రదేశానికి వెల్లండి. బీచ్ లేదా మీ అమ్మకు నచ్చే ప్లేస్ కు పిక్నిక్ కు వెళ్లండి. ఆ రోజంతా ఆమెతో మాట్లాడుతూ.. కబుర్లు చెప్పుకుంటూ గడపండి.
ఆమెకు ఇష్టమైన వంటను వండండి.. పిల్లలకు ఇష్టమైన వంటలను వండటంతోనే అమ్మ సమయం గడిచిపోతుంది. తనకంటూ ఇష్టా ఇష్టాలు ఉన్నా.. ఏనాడు చేసుకోదు. అందుకే ఆ రోజున మీ అమ్మకు ఇష్టమైన వంటలను స్వయంగా మీరే చేయండి. ఇంటి పెరట్లో అన్ని సర్ది మీ అమ్మను సర్ ప్రైజ్ చేయండి. ఇలా చేస్తే మీ అమ్మగారు ఎంతో సంతోషిస్తారు.
కలిసి కేక్ చేయండి.. మదర్స్ డే నాడు మంచి కేక్ తో సెలబ్రేట్ చేయకుంటే ఏం బాగుంటది చెప్పంది.. అందుకే ఆ రోజున మీ అమ్మతో కలిసి కేక్ ను తయారుచేయండి. కేక్ తయారుచేసేటప్పుడు మీ అమ్మతో జోలి పెడుతూ.. నవ్వుతూ మాట్లాడండి. అవె ఆమెను ఎంతో సంతోషింపజేస్తాయి.
పాత ఫోటోలను తెరవండి.. పాత సంగతులు ఎప్పుడూ మనసుకు హాయిని, సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీ ఫ్యామిలీ ఆల్బమ్ ను బయటకు తీసి వాటిని చూడండి. అవి ఏయే సందర్బంలో దిగినవో మీ అమ్మను అడగండి. మీ అమ్మతో ఈ సంగతులను షేర్ చేసుకోవడం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది.