Hair care: ఇలా తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది జాగ్రత్త
Hair care: చాలా మంది హెయిర్ ఫాల్ అవుతోందని టెన్షన్ పడుతుంటారు. కానీ మనం చేసే కొన్ని తప్పుల వల్లే జుట్టు బాగా రాలుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తలస్నానం చేసే టైంలో కొన్ని తప్పులను చేయడం వల్లే జుట్టు ఎక్కువగా రాలుతుంది.

వేడి నీళ్లు
చాలా మంది తలస్నానం చేయడానికి వేడి వేడిగా ఉండే నీళ్లను ఉపయోగిస్తుంటారు. కానీ వేడి వేడి నీళ్లతో తలస్నానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో తలస్నానం చేస్తే తలలో ఉన్న మురికితో పాటుగా సహజ నూనెలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల జుట్టు బాగా పొడిబారుతుంది.
షాంపూను ఇలా వాడకండి
చాలా మంది షాంపూను డైరెక్ట్ గా తలకు పెట్టేసుకుంటుంటారు. కానీ షాంపూను ఎప్పుడైనా సరే కొన్ని నీళ్లలో కలిపి జుట్టుకు పెట్టుకోవాలి. దీనివల్ల షాంపూలోని కెమికల్స్ ప్రభావం తగ్గుతుంది. నీళ్లలో కలిపిన షాంపూను తలకు పెట్టి వేళ్లతో నెమ్మదిగా నెత్తిని మసాజ్ చేయాలి. దీనివల్ల నెత్తిమీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే జుట్టుకున్న మురికి అంతా పోతుంది.
సల్ఫేట్ లేని షాంపూ
షాంపూ వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. సల్ఫేట్ ఎక్కువగా ఉండే షాంపూలు మన జుట్టులోని తేమను తొలగిస్తాయి. దీంతో జుట్టు పొడిబారుతుంది. అందుకే సల్ఫేట్ లేని షాంపూలనే వాడండి. ఇది నెత్తిమీద తేమను కాపాడుతుంది.
చల్లని నీరు
గోరువెచ్చని నీళ్లను వాడినా చివర్లో చల్ల నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు మెరుస్తుంది. సాఫ్ట్ గా అవుతుంది.
ఆయిల్ మసాజ్
జుట్టు రాలకూడదంటే తలస్నానం చేయడానికి ముందు ఖచ్చితంగా నెత్తికి నూనె పెట్టి కాసే మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మూలాలు బలంగా అవుతాయి.
ఇలా తుడవాలి
తలస్నానం చేసిన వెంటనే టవల్ తో గట్టిగా తుడవకూడదు. దీనివల్ల జుట్టు మూలాలు బలహీనంగా అవుతాయి. దీంతో జుట్టు బాగా ఊడిపోతుంది. అందుకే వెంట్రుకలను మెల్లిగా తుడిచి గాలికి ఆరనివ్వండి.