గుడ్డులో కన్నా ఈ గింజల్లోనే ప్రోటీన్ ఎక్కువ, శాకాహారులకు బెస్ట్ ఆప్షన్
Protein Foods: శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాలి. రోగనిరోధక శక్తి పెరగాలంటే ప్రోటీన్ ఉండే పదార్థాలను తినాల్సిందే. గుడ్డుతో పోలిస్తే వేరుశనగ పలుకుల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.

ప్రోటీన్ కోసం ఏం తినాలి?
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రోటీన్ పాత్ర ఎక్కువే. ప్రోటీన్ అనగానే అందరికీ గుడ్లే గుర్తొస్తాయి. కానీ మాంసాహారులు మాత్రమే గుడ్లను తింటారు. శాఖాహారులకు కోడిగుడ్లు తినడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటివారు గుడ్లకు బదులు వేరుశనగ పలుకులను తినేందుకు ప్రయత్నించండి. గుడ్లతో పోలిస్తే వీటిలోనే అధికంగా ప్రోటీన్ ఉంటుంది. పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ గా వీటిని చెప్పుకోవచ్చు. ఇది గుండె, మెదడు, చర్మ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మీ మెనూలో ప్రతిరోజు వేరుశనగ పలుకులు ఉండేలా జాగ్రత్తగా పడండి.
చవకైన గింజలు ఇవి
వేరుశనగ పలుకలను ప్రోటీన్ల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. దీనిలో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. 100 గ్రాముల వేరుశనగలను తింటే 25 నుంచి 26 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అంటే జీడిపప్పు, బాదం పప్పుల కన్నా దీనిలోనే అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది కణజాలాన్ని మరమ్మతులు చేయడానికి, కండరాలను బలంగా నిర్మించడానికి సహాయపడుతుంది. కోడిగుడ్లతో పోలిస్తే వేరుశనగ పలుకులే ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నమాట.
బరువు తగ్గుతారు
వేరుశనగల్లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను శరీరంలో పెంచుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేరుశనగ పలుకులను తినడం ద్వారా గుండెకు ఎంతో రక్షణ లభిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా వేరుశనగ మంచి ఆప్షన్. దీనిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ త్వరగా పొట్ట నిండేలా చేస్తాయి. దీనివల్ల మీకు ఆకలి కూడా వేయదు. అతిగా తినడం మానేస్తారు. అప్పుడు బరువు నియంత్రణలోనే ఉంటుంది.
మెదడుకు మేలు
వేరుశెనగలు నియాసిన్, విటమిన్ బి3 వంటివి అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును కూడా సవ్యంగా ఉండేలా చేస్తాయి. నాడీ వ్యవస్థ పై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది. దీనివల్ల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే వేరుశనగల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే జింక్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి చర్మం మెరిసిపోవడంలో వేరుశనగలు సహాయపడతాయి.
చర్మానికి, జుట్టుకు
కేవలం చర్మానికే కాదు జుట్టుకు కూడా వేరుశనగల ఉపయోగం ఎంతో ఉంది. దీనిలో ఉండే విటమిన్ ఇ, జింక్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చినట్టే.. జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తాయి. చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేసి ముఖంపై ముడతలు, గీతలు వంటివి రాకుండా చేస్తాయి. అంటే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. కాబట్టి ఎక్కువ కాలం మీరు యవ్వనంగా ఉండాలని కోరుకుంటే మీ ఆహారంలో వేరుశనగ పలుకులను ఉండేలా చూసుకోండి.
ఎలా తినాలి?
వేరుశనగ పలుకులను తినేందుకు ఉత్తమ మార్గం ఉడకబెట్టి తినడమే. లేదా ముందు రోజు రాత్రిపూట వేరుశనగ పలుకులను నీటిలో వేసి నానబెట్టండి. అవి ఉదయానికల్లా పచ్చిగా మారుతాయి. వాటిని కొంచెం నీళ్లల్లో ఉడకబెట్టి తాలింపు వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. నానబెట్టిన వేరుశనగ పలకలను ఉదయాన్నే తిన్నా కూడా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. వాటిని పచ్చిగా తిన్నా కూడా మంచిదే.