పొట్ట క్యాన్సర్ వస్తే మొదటి దశలో కనిపించే లక్షణాలు ఇవే, నిర్లక్ష్యం చేయకండి
Stomach Cancer: పొట్ట క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువమందికి వస్తోంది. దీని లక్షణాలు చాలా మందికి తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. పొట్ట క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రాథమిక దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పొట్ట క్యాన్సర్ తో జాగ్రత్త
నేటికాలంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. మనదేశంలో పొట్ట క్యాన్సర్ బారిన ఎక్కువ శాతం మంది పడుతున్నారు. కానీ పొట్ట క్యాన్సర్ లక్షణాలు చాలా మందికి తెలియవు. దీని వల్ల ఆ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో క్యాన్సర్ ముదిరిపోయాకే బయటపడుతోంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, నొప్పి వస్తుంటే వాటిని విస్మరించవద్దు. పొట్ట క్యాన్సర్ లక్షణాలు ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.
పొట్ట క్యాన్సర్ లక్షణాలు
పొట్ట క్యాన్సర్ బారిన పడినవారికి కొద్దిగా తిన్నా కూడా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. పొట్టలో ఏదో బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కడుపు లోపలి పొరలో పెరిగే కణితే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు బరువు త్వరగా తగ్గిపోతారు. రోజూ ఆకలి వేయడం కూడా తగ్గిపోతుంది.
రంగు మారిపోతుంది
మీ మలం రంగు మారినా కూడా తేలికగా తీసుకోకూడదు. మలంలో రక్తం కనిపిస్తే అది పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు. కాబట్టి మలం రంగులో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.
కడుపు నొప్పి
పొట్ట నొప్పి తీవ్రంగా వేధిస్తుంటే తేలికగా తీసుకోకూడదు. తరచుగా కడుపు కింది లేదా పైభాగంలో నొప్పి వచ్చిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు పొట్టలో మంటగా అనిపిస్తుంది. ఆ మంట పొట్ట నుంచి ఛాతీ వరకు వ్యాపిస్తుంది. మీకు ఇలా అనిపిస్తే తేలికగా తీసుకోకండి.
అతిగా పుల్లని త్రేన్సులు
భోజనం చేసిన తర్వాత విపరీతంగా త్రేన్సులు రావడం కూడా పొట్ట క్యాన్సర్ లక్షణంగానే చెప్పుకోవాలి. ఆ త్రేన్పులు లోహపు వాసనను లేదా పుల్లని వాసనను వస్తుంటే మాత్రం కడుపులో కణితి ఉందేమో అనుమానించాలి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
పొట్ట క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం కొందరిలో అధికంగా ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజూ ధూమపానం చేస్తారో వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రోజూ మద్యం తాగేవారికి కూడా రావచ్చు. అధిక మసాలా, ఉప్పు ఆహారాలు తినేవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, బొగ్గు, కలప, రబ్బరు గనుల్లో పనిచేస్తున్నవారు పొట్ట క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్నా కూడా వారసులుగా మీకు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఎప్స్టీన్ బార్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పొట్ట నొప్పి రావచ్చు.

