Motivational story: అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది.. గొప్ప సందేశాన్ని ఇచ్చే నీతి కథ.
కథలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాకుండా గొప్ప సందేశాలను కూడా అందిస్తాయి. అందుకే చిన్ననాటి నుంచి కథలను చెబుతూ పెంచుతుంటారు. అలాంటి ఒక గొప్ప సందేశాన్ని అందించే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రాజు అనే ఓ వ్యక్తి సొంత వ్యాపారాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఒక రోజు ఓ దొంగ నగలను దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి రాజు దుకాణంలోకి పరిగెత్తుకొని వెళ్తాడు. ఇంతలోనే రాజు ఆ దొంగను 'ఎవరు నువ్వు, ఎందుకు కంగారు పడుతున్నావు. అసలు ఏమైంది.?' అని ప్రశ్నిస్తాడు.
Telugu Story
దొంగ బదిలిస్తూ.. 'నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు. నగలు దొంగతనం చేసిన నన్ను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు కాసేపు నీ దుకాణంలో ఆశ్రయం కల్పిస్తే నేను దొంగలించిన బంగారాన్ని సగం సగం పంచుకుందాం. నేను దొంగలించిన మొత్తం నగల విలువ రూ. 10 లక్షలు ఉంటుంది' అని చెప్తాడు. దీంతో రాజుకు ఒక్కసారిగా అత్యాశ పుడుతుంది.
రూ. 5 లక్షలు వస్తాయన్న ఆశతో తాను చేస్తుందని తప్పనే విషయాన్ని కూడా రాజు మర్చిపోతాడు. దుకాణంలో ఓ మూలన దాక్కోమని దొంగకు సలహా ఇస్తాడు. కాసేపటికి అటుగా వచ్చిన పోలీసులు రాజును దొంగ గురించి అడిగ్గా.. స్పందిస్తూ.. 'నేను ఎవరినీ చూడలేదు. అసలు ఇటు వైపు ఎవరూ రాలేదు' అని చెప్తాడు.
పోలీసులు వెళ్లిపోగానే రాజు ఫుల్ ఖుషీ అవుతాడు. దొంగ తనకు నగలు ఇస్తాడని ఆశపడతాడు. అయితే నెమ్మదిగా బయటకు వచ్చిన దొంగ తన అసలు రూపాన్ని బయటపెడతాడు. ముందుగా చెప్పినట్లు తన వాటా నగలు ఇవ్వమని అడగ్గానే.. ఒక్కసారిగా తన సంచిలోని కత్తిని బయటకు తీసి రాజును బెదిరించడం మొదలు పెడతాడు. అరిస్తే చంపేస్తానని, గల్లా పెట్టెలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఇచ్చేయాలని బెదిరిస్తాడు.
Telugu Story
దీంతో చేసేది ఏం లేక ప్రాణ భయంతో రాజు తన డబ్బును మొత్తం దొంగకు ఇచ్చేస్తాడు. డబ్బు తీసుకున్న దొంగ వెంటనే దుకాణం నుంచి తుర్రమని పారిపోతాడు. దొంగ మాటలు నమ్మి మోసపోయానని తెలుసుకున్న రాజు గుక్కపెట్టి ఏడుస్తాడు. చివరికి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా ఉండిపోతాడు.
నీతి: దురాశ దుఃఖానికి చేటు అనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. దొంగతనం తప్పని తెలిసినా అత్యాశకు పోయిన రాజు ఉన్నది కూడా కోల్పాయాడు. అందుకే ఈ కథలో రాజులాగా దురాశకు పోకుండా నీతిగా జీవించాలి.