Avoid Beer: వీరికి బీర్ విషంతో సమానం, తాగకపోవడమే మంచిది
Avoid Beer: కొత్త ఏడాదికి స్వాగతం పలుకుంటూ బీర్ పార్టీలు బాగానే చేసుకుని ఉంటారు. తాగినప్పుడు మజాగా ఉంటుంది.. కానీ శరీరంలో చేరాక మాత్రం తేడా కొడుతుంది. కొంతమంది బీర్ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బీర్ తాగే అలవాటు ఉందా?
కొత్త సంవత్సర వేడుకల్లో భారీగానే బీరు పార్టీలు చేసుకుని ఉంటారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31ని ఆస్వాదించడానికి చాలామంది బీరుతోనే ఎంజాయ్ చేసి ఉంటారు. స్నేహితులతో కలిసి బీర్ తాగి ఆనందించారు. కానీ బీర్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది తెలిసినా చాలామంది బీర్ తాగుతారు. ముఖ్యంగా కొంతమంది బీర్ కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.
కొంతమంది ఆల్కహాల్ కు బానిసలవుతారు. అలాంటి వారు ఎక్కువగా తాగి ఆరోగ్య ప్రమాదాలు తెచ్చుకుంటారు. అందుకే మితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సమస్యలు ఉన్నవారు బీర్ తాగకూడదని చెబుతున్నారు. బీర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు బీర్ తాగకూడదో తెలుసుకోండి.
ఈ పొట్ట వ్యాధి ఉంటే
ఉదరకుహర వ్యాధి దీన్నే సెలియాక్ వ్యాధి అంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు బీర్ తాగడం ఏ మాత్రం మంచిది కాదు. బీర్ తాగడం వల్ల చిన్న ప్రేగు దెబ్బతింటుంది. సెలియాక్ వ్యాధి ఉన్న వారు గ్లూటెన్ ఉన్న ఆహారాలు తినకూడదు. ఇవి మరింతగా సమస్యను పెంచెస్తాయి. బీర్‌లో కూడా గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులలో మంట, కడుపులో వాపుకు కారణమవుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు, అధిక బరువుతో బాధపడుతున్నవారు బీర్ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే బీర్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు ఏమీ ఉండవు. కాబట్టి బీర్ తాగడం వల్ల బరువు పెరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువ.
మధుమేహం ఉంటే
డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నవారు బీర్ కు దూరంగా ఉండాలి. ఇలాంటి వారు బీర్ తాగడం వల్ల వారి షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. బీర్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది హైపోగ్లైసీమియాకు కారణం అవుతుంది. దీని వల్ల డయాబెటిస్ వ్యాధి మరింతగా ముదిరిపోతుంది.
ఇక గుండెల్లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు తరచూ వచ్చే వారు కూడా బీర్ తాగడం ఏమాత్రం మంచిది కాదు. దీన్ని తాగడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. బీర్ వల్ల కాలేయ సమస్యలు విపరీతంగా వచ్చేస్తాయి. బీర్‌లో ఆల్కహాల్ ఉండటం వల్ల కాలేయం మీద భారం తీవ్రంగా పెరిగిపోతుంది.దీన్ని దీర్ఘకాలంగా తాగితే ఫ్యాటి లివర్, లివర్ వాపు, లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. కాలేయం సరిగా పనిచేయకపోతే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లవు. ఇది మీ శరీరాన్ని కుదేలు చేస్తుంది.
ఐబీఎస్ ఉంటే
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) సమస్య ఉన్నవారు బీర్ తాగడం ఏమాత్రం మంచిది కాదు. కడుపు నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం లాంటి సమస్యలు ఉన్నవారు బీర్ కు దూరంగా ఉంటేనే మంచిది. బీర్ తాగడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం కూడా పడుతుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంగా తాగితే డిప్రెషన్, ఆందోళన సమస్యలు కూడా పెరుగుతాయి.దీన్ని తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. నోటి, గొంతు, కాలేయం, రొమ్ము క్యాన్సర్లకు ఆల్కహాల్ ఒక కారణంగా గుర్తించారు. అంతేకాదు ఇది వ్యసనంగా మారితే పెద్ద సమస్యగా మారుతుంది. ఒకసారి అలవాటు పడితే మానడం కష్టం అవుతుంది.

