Soft Chapati: చపాతీ మెత్తగా బాగా పొంగాలంటే ఈ మూడు చిట్కాలు పాటించండి
Soft Chapati: చపాతీలు తినేవారి సంఖ్య అధికంగా. కానీ అవి మెత్తగా, పొరలు పొరలుగా చేయడం మాత్రం చాలా తక్కువమందికే వచ్చు. చపాతీలు స్మూత్ గా రావాలన్నా, పొంగాలన్నీ కొన్ని చిట్కాలు పాటించాలి. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా చపాతీలు మెత్తగా వచ్చే చేయవచ్చు.

చపాతీలకు అభిమానులు ఎక్కువ
భారతీయ వంటల్లో చపాతీలు భాగమైపోయాయి. అన్నం మానేసి చపాతీ తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. చాలామంది ఉదయం అల్పాహారం లేదా రాత్రి భోజనానికి చపాతీలు తింటూ ఉంటారు. కానీ కొందరికి చపాతీలు మందంగా, గట్టిగా వస్తాయి. పెనం మీద వేస్తే అవి సరిగ్గా పొంగవు. నిజానికి పొంగిన చపాతీలు రుచిగా, మృదువుగా ఉంటాయి. మరి చపాతీలు పొంగాలంటే ఏం చేయాలి? మెత్తటి చపాతీలు చేయడానికి పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకోండి.
పిండి కలపడం...
చపాతీలు చేసేందుకు చపాతీ పిండి కలపడం చాలా ముఖ్యం. గోధుమ పిండిలో నెమ్మదిగా నీళ్లు పోస్తూ బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ వదులుగా కాకుండా బాగా కలపాలి. పిండి మృదువుగా ఉంటేనే చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి. పిండిని బాగా నలిపి, పిసికి, బాగా కలపడం వల్ల పిండి మెత్తగా మారుతుంది. ఇప్పుడు కలిపిన పిండిపై మూతపెట్టి 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి బాగా నానుతుంది. చపాతీలు మెత్తగా వస్తాయి.
చపాతీలు ఇలా ఒత్తాలి
చపాతీ ఒత్తడం కూడా చాలా ముఖ్యం. చపాతీ పిండి నుంచి కొంత ముద్దని తీసి గుండ్రంగా చుట్టుకోవాలి. ఇప్పుడు పీటపై పెట్టి అంచులు, మధ్యభాగం సమానంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే కాల్చేటప్పుడు గాలి ఒకవైపు చేరి, పూర్తిగా పొంగకుండా అలా ఉండిపోతుంది. ముందుగా పెనం స్టవ్ మీద పెట్టి బాగా వేడెక్కేవరకు ఉంచాలి. ఆ తరువాతే చపాతీని వేసి కాల్చాలి. పెనం వేడెక్కకపోతే చపాతీ పెనానికి అతుక్కుపోతుంది. పెనం సరైన ఉష్ణోగ్రతలో ఉంటేనే అది సరిగ్గా కాలి పొంగడం మొదలవుతుంది.
మెత్తటి వస్త్రంతో నొక్కండి
పెనంపై రెండు వైపులా కాల్చాలి. అలా అని పెద్ద మంట మీద కాల్చకూడదు. లేత గోధుమ రంగు మచ్చలు కనిపించినప్పుడు, ఒక మందపాటి వస్త్రంతో లేదా గరిటెతో నెమ్మదిగా నొక్కండి. దీనివల్ల ఆవిరి చేరి చపాతీ పొంగుతుంది. ఇది మరింత మెత్తగా మారుతుంది. కొంతమంది తక్కువ మంట మీద నేరుగా చపాతీని కాలుస్తారు. ఇది చపాతీ త్వరగా పొంగడానికి సాయపడుతుంది. కానీ మీకు చపాతీలు చేయడంలో మంచి అనుభవం ఉంటేనే ఇలా చేయండి.
ఈ మూడే ముఖ్యం
పిండి సరిగ్గా కలపడం, సరైన పద్ధతిలో ఒత్తడం, పెనం సరైన ఉష్ణోగ్రత వరకు వేడి చేయడం... ఈ మూడు విషయాలు సరిగ్గా చేస్తేనే చపాతీలు మెత్తగా వస్తాయి. మెత్తటి చపాతీలు ఏ కూరతో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఓసారి వండి చూడండి. ఇవి నోట్లో పెడితే కరిగిపోయేలా వస్తాయి.

