ఈ అలవాట్లుంటే కంటిచూపు తగ్గుతుంది జర జాగ్రత్త..
ఈ రోజుల్లో చిన్న పిల్లలు, యువత కూడా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ కంటిచూపుతో. కంటి చూపు తగ్గడానికి మన అలవాట్లు కూడా కారణమేనంటున్నారు నిపుణులు. అవేంటంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధుల్లో నాలుగింట ఒక వంతు మంది భారతదేశంలోనే నివసిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్ నెస్ అధ్యయనం ప్రకారం.. దేశంలో సుమారు 12 మిలియన్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారట. ప్రపంచంలో గరిష్టంగా 39 మిలియన్ల మంది ఉన్నారు. ఆరోగ్యం మాదిరిగానే వయుసు పెరుగుతున్న కొద్దీ.. కంటిచూపు కూడా తగ్గుతుంది. అయితే కొన్ని జీవనశైలి అలవాట్లు కూడా కంటిచూపును తగ్గిస్తాయి. అవేంటంటే..
స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం
ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అవసరానికి మించి వీటిని యూజ్ చేస్తున్నారు. కొంతమందైతే ఇవి లేకుండా క్షణ కాలం కూడా ఉండలేకపోతుంటారు. కానీ పొద్దంతా ఫోన్లలో గడిపితే ఎన్నో శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లను ఒకటి కాకపోతే ఇంకోటి అంటూ ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. కానీ ఎలాక్ట్రానిక్ గాడ్జెట్ల స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. అలాగే కళ్లపై ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పిల్లలలో.. స్క్రీన్లలో ఎక్కువ సమయం గడిపే వారు హెల్తీగా ఉండటానికి ఎక్కువగా శారీరక శ్రమ చేయండి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ లను చూడకుండా ఆపండి.
ధూమపానం
స్మోకింగ్ మన ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. ఈ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అంతేకాదు ఇది కళ్లకు కూడా హాని కలిస్తుంది. స్మోకింగ్ వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత, కంటిశుక్లం, ఆప్టిక్ నరాల నష్టం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యలన్నీ కంటి చూపును తగ్గిస్తాయి. అంతేకాదు క్యాన్సర్, 50 ఏళ్లు పైబడిన పెద్దలలో కూడా దృష్టి నష్టం జరుగుతుంది.
ఇతర ఆరోగ్య పరిస్థితులను నియంత్రించకపోవడం
డయాబెటీస్, అధిక రక్తపోటు, థైరాయిడ్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వీటిని నియంత్రణలో ఉంచకపోతే మీ కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచకపోతే రెటీనా మైక్రోవాస్కులర్ సమస్య పెరుగుతుంది. రక్తపోటు రెటినోపతి లక్షణాలు 40, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో సర్వ సాధారణం.
తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం
కంటికి సరిపడా నిద్రలేకపోవడం వల్ల కళ్ళు పొడిబారుతాయి. అలాగే కళ్లు ఎర్రగా మారతాయి. కంటిచుట్టూ నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి.అంతేకాదు కంటి నొప్పి కూడా వస్తుంది. ముఖ్యంగా దీనివల్ల కంటిచూపు తగ్గుతుంది. నిద్ర లేమి వల్ల శరీరంలో హార్మోన్ల, న్యూరోనల్ మార్పులు వంటి శారీరక మార్పులు వస్తాయి. ఈ మార్పులు దృష్టి లోపాన్ని మరింత పెంచుతాయి. అలాగే ఇంట్లోనే ఉండటం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కూడా కంటి చూపు బలహీనపడుతుంది. కంటిచూపు తగ్గడం జన్యుపరమైనది. అయినప్పటికీ ప్రతిరోజూ ఆరుబయట పాల్గొనే వారితో పోలిస్తే ఇంటి లోపల ఎక్కువ సమయం గడిపే పిల్లల్లోనే కంటిచూపు తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.
హైడ్రేటెడ్ గా ఉండకపోవడం
శరీర ఉష్ణోగ్రత, ఇతర జీవక్రియ విధులను నియంత్రించడానికి మన కణాలకు, అవయవాలకు, కణజాలాలకు నీరు చాలా అవసరం. మన కంట్లోంచి వచ్చే కన్నీరు మన కళ్ళను తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. వాతావరణంలోని దుమ్ము, దూళి, మలినాలు, ఇతర కణాలు మన కళ్ళలోకి వెళ్లడం చాలా సహజం. అయితే కళ్లలో తేమ లేకుంటే.. కళ్లు పొడిబారడం లేదా కళ్లలో ఎరుపు లేదా వాపు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతిరోజూ మన శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచాలి.
కంటి చూపును మెరుగుపర్చడానికి చిట్కాలు
ముదురు ఆకుపచ్చ కూరలు, చేపలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లుటిన్, జియాక్సంతిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే పెద్దవయసు వారిలో వచ్చే మాక్యులర్ క్షీణత (ఎఆర్ఎండి) ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన బరువు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుది. కంటి ఆరోగ్యం బాగుంటుంది.
మీ ఫ్యామిలీలో ఎవరికైనా దృష్టి సమస్యలున్నాయో తెలుసుకోండి. ఎఆర్ ఎమ్ డి, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, రెటీనా వంటి సమస్యలన్నీ జన్యు పరంగా వస్తాయి.
సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మన చర్మానికి మాత్రమే కాదు, మన కళ్ళకు కూడా హాని కలిగిస్తాయి. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు 100 శాతం యువి శోషణ లేదా UVA, UVB కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ను ధరించండి. అలాగే పెద్దగా ఉండే టోపీని పెట్టుకోండి.