కోడి గుడ్డు ఇలా అయితే నిన్ను తినేదెలా చెప్పు.. తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది..
Eggs: సండే కానీ మండే కానీ రోజూ ఒక గుడ్డు తినాలని నిపుణులు చెబుతుంటారు. గుడ్డుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి మరి. అందుకే కచ్చితంగా గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. నాన్ వెజ్ తినని వారు కూడా కోడి గుడ్డును తీసుకుంటారు. ఇలా నిత్య జీవితంలో భాగమైన కోడిగుడ్డు ప్రస్తుతం ప్రజలను షాక్‌కి గురి చేస్తోంది. కోడి గుడ్డు గురించి ఆలోచించాలంటేనే భయపడేలా చేస్తోంది..
eggs
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కోడి గుడ్డు ధరలు దూసుకుపోతున్నాయి. ఓ వైపు చికెన్ ధర తగ్గుతుంటే మరో వైపు కోడి గుడ్డు ధర పెరగడం గమనార్హం. కార్తీక మాసానికి ముందు కిలో చికెన్ ధర రూ. 230 వరకు ఉండగా ఇప్పుడు రూ. 170కి పడిపోయింది. సాధారణంగా వింటర్‌లో కోడి గుడ్డు ధర పెరగడం ఖాయం. అయితే ప్రస్తుతం మాత్రం కోడి గుడ్డు ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కోడి గుడ్డు ధర ఏకంగా రూ. 7కి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా రూ. 7.50కి కూడా గుడ్లను విక్రయిస్తున్నారు. కోడి గుడ్డు ధర పెరగడానికి ఎన్నో కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా కోళ్లకు మేతగా ఉపయోగిస్తున్న మొక్కజొన్న ధర పెరగడమే కోడి గుడ్డు ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు. మొక్క జొన్న ధర టన్నుకు రూ. 22 నుంచి 25 వేలకు, నూకలు రూ. 18 నుంచి 22 వేల వరకు పెరిగింది. ఈ కారణంగా ఒక్క గుడ్డు ఉత్పత్తికి సుమారు రూ. 5 ఖర్చు అవుతుందని పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు.
దీంతో ఒక్క గుడ్డు రూ. 7కి విక్రయించినా లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల బెంగాల్, బిహార్, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫామ్స్ పెరిగిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు తగ్గాయి. ఈ కారణంగా ఇక్కడ ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగ్గట్లుగా గుడ్ల ప్రొడక్షన్ లేకపోవడంతో కూడా ధరలు పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అటు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులతో పాటు సామాన్య ప్రజలకు కోడి గుడ్డు ఇబ్బందిగా మారింది. చికెన్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో చలికాలం కోళ్ల ఉత్పత్తి అధికంగా ఉండడం కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ఈ సీజన్‌లో కంపెనీలు గుడ్లను పిల్లల ఉత్పత్తి కోసం ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగానే మార్కెట్లో కోడిగుడ్ల కొరత పెరిగింది, వినియోగదారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి గుడ్ల ధర పెరిగిందని భావిస్తున్నారు.
egg
ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో కోడిగుడ్డు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలఖారులో క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ ఉండడంతో కేక్‌లకు డిమాండ్ పెరగనుంది. కేక్‌ల తయారీలో ఎక్కువగా గుడ్లను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో గుడ్లను మరింత డిమాండ్ పెరగనుంది. ఇది ధర మరింత పెరగడానికి కారణమవుతుండొచ్చని అంచనా వేస్తున్నారు. పెరిగిన కోడి గుడ్ల ధర ఇతర వాటిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరి పైపైకి వెళ్తున్న కోడి గుడ్డు ఎప్పుడు దిగొస్తుందో చూడాలి.