ఇంట్లోకి పురుగులు, కీటకాలు వస్తున్నాయా ? ఈ చిట్కాలు పాటిస్తే మళ్లీ కనిపించవు..
Insects: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమలు, ఈగలు, ఇతర కీటకాల బెదడ ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ, సాయంత్రం కాగానే మనుషులపై యుద్దంలా దండయాత్ర ప్రకటిస్తాయి. ఈ పురుగులు ఇంట్లోకి రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

వర్షాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఇంట్లోకి అనేక రకాల కీటకాలు కూడా వస్తుంటాయి. అలాగే అనేక వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాల ద్వారా వీటిని తొలగించుకోవచ్చు.
వేప నూనె, కర్పూరం
కొద్దిగా వేపనూనెను నీటిలో కలిపి సాయంత్రం వేళ తలుపులు, కిటికీలు కీటకాలు వచ్చే చోట స్ప్రే చేయండి. ఈ వాసనను కీటకాలు ఇష్టపడవు. అలాగే.. దోమలు, ఇతర కీటకాలను తరిమికొట్టడానికి కర్పూరం మాత్రలు బెటర్ ఛాయిస్. వీటిని పొగను పీల్చడం ద్వారా పారిపోతాయి.
పరిశుభ్రత
మురికి, తేమ ఉన్న ప్రదేశాలలో కీటకాలు పెరుగుతాయి, కాబట్టి మీ ఇంట్లో పరిశుభ్రత, పొడిగా ఉండేలా చూసుకోండి. ఏదైనా ఆహార పదార్థాన్ని బయట ఉంచవద్దు. ఎల్లప్పుడూ చెత్తను బుట్టలో వేయాలి. దానిని క్రమం తప్పకుండా ఖాళీ చేయండి. ఇంట్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి, కూలర్లు, కుండలు, ఇతర పాత్రలలో నీటిని క్రమం తప్పకుండా మార్చండి. వంటగది సింక్, బాత్రూమ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచండి. ఫినాయిల్ లేదా ఏదైనా క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రం చేయండి.
నివారణ చర్యలు
మీ ఇంటి తలుపులు, కిటికీలపై దోమతెరలను అమర్చండి. ఇవి కీటకాలను లోనికి రాకుండా చేస్తాయి. దోమల తెరలు వినియోగించడంతో దోమల నుంచి రక్షణ పొందవచ్చు. వీటిని ఉపయోగించడంతో తలుపులు, కిటికీల అందం కూడా రెట్టింపు అవుతుంది.
ఇలా తరిమికొట్టవచ్చు
కీటకాలకు ఇష్టపడని వాసన కలిగించే కొన్ని మొక్కలు ఉంటాయి. వాటిని మీ ఇంటి లోపల లేదా బాల్కనీలో పెంచడం ద్వారా కీటకాలను తరిమికొట్టవచ్చు. తులసి, నిమ్మగడ్డి, సిట్రోనెల్లా దోమలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది. వీటితో దోమల నివారణ ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు.