ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే ప్రతివారం ఇవి మిస్ కాకుండా తినండి
బరువు తగ్గాలంటే కడుపును మాడ్చుకోవాల్సిందేనంటారు కొందరు. నిజమేంటంటే కడుపు నిండా తింటూ కూడా చాలా చాలా ఫాస్ట్ గా బరువును తగ్గొచ్చు. అయితే ఏవి పడితే అవి అసలే తినకూడదు..

మనందరికీ తెలుసు బరువు తగ్గడం అంత తేలికైన పని కాదని. అందుకే చాలా మంది మొత్తమే తినడం మానేస్తుంటారు. ఇలాగైనా బరువు తగ్గుతామని. నిజానికి బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. పుష్టిగా తింటూ కూడా సులువుగా బరువు తగ్గొచ్చు. అలా అని ఏవి పడితే అవి అసలే తినకూడదు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే అటూ ఆరోగ్యం బాగుంటుంది. ఇటూ కేలరీలు కూడా బర్న్ అవుతాయి. బరువు తగ్గాలంటే మీరు తినే ఆహారంలో ప్రోటీన్లతో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం వారంలో ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి.
చియా విత్తనాలు
ఆరోగ్యంగా బరువు తగ్గడానికి చియా విత్తనాలు ఎంతో సహాయపడతాయి. ఈ విత్తనాల్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. భోజనానికి రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను చేర్చండి. వీటిద్వారా మీ రోజు వారి ఫైబర్ అవసరాల్లో 40 శాతం అందుతుంది. వీటిని నానబెట్టి తింటే చాలా తొందరగా కడుపు నిండుతుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతాయి. చియా విత్తనాలను తరచుగా తినడం వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. వీటిని సలాడ్లలో వేసుకుని కూడా తినొచ్చు. లేదా ఖర్జూరాలతో కలిపి లడ్డూలను చేసుకుని కూడా తినొచ్చు.
గుడ్లు
బరువు తగ్గడానికి సహాయపడే ఉత్తమ ఆహారాల్లో గుడ్లు ఒకటి. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చసొనలో విటమిన్ డి తో పాటుగా కోలిన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. తెల్లసొనలో 4 నుంచి 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే వీటిని రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి. గుడ్లను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
వాల్ నట్స్
వాల్ నట్స్ లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే తక్షణ శక్తి కూడా అందుతుంది. పగటిపూట ఏవైనా తినాలనిపించినప్పుడు బర్గర్, చిప్స్ లకు బదులుగా వాల్ నట్స్ ను తినండి. ఇవి మీ ఆకలి కోరికలను నియంత్రిస్తాయి. అంతేకాదు మెదడు సక్రమంగా పనిచేయడానికి కూడా ఇవి సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. వీటిని జస్ట్ చిరుతిండిలా కాకుండా పాస్తా వంటి వంటకాల్లో వేసి తినండి. సలాడ్లపై చల్లుకుని తింటే కూడా టేస్ట్ బాగుంటుంది.
పెరుగు
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తినడం వల్ల మీకు అంత తొందరగా ఆకలి వేయదు. పెరుగు మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువు పెరగడాన్ని కూడా నిరోధిస్తుంది. పెరుగులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. పెరుగును తినడం వల్ల చక్కెర, కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలన్న కోరికలు తగ్గుతాయి.
ఫిష్
ఫిష్ లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొవ్వులు లేదా కార్భోహైడ్రేట్ల కంటే వీటిలోని ప్రోటీన్ జీవక్రియకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు చేపలను ఎక్కువగా తింటూ ఉండాలి.
పాప్ కార్న్
పాప్ కార్న్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో బరువు తగ్గేందుకు సహాయపడే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. అంతేకాదు కడుపు కూడా నిండుగా ఉంటుంది. అలా అని అతిగా అసలే తినకూడదు. ఒకవేళ తింటే అజీర్థి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ పాప్ కార్న్ ను తినకూడదు. అయితే ఈ పాప్ కార్న్ లను బయట తినడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో హానికరమైన నూనెలు, ఉప్పు ఎక్కువగా వేస్తారు. దీనివల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే పాప్ కార్న్ ను ఇంట్లోనే తయారుచేసుకుని తినండి.