ఈ దీపావళికి ఆన్లైన్లో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ పెట్టినవి ఏమిటో తెలుసా?
దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో ఎక్కువ వస్తువులు కొనాల్సి వస్తుంది. ఇంతకు ముందు మార్కెట్ వెళ్లి కొనేవారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్లో ఆర్డర్ పెడితే చాలు ఇంటికే వచ్చేస్తున్నాయి. ఈ దీపావళికి ఏ వస్తువులు ఎక్కువగా ఆర్డర్ పెట్టారో తెలుసా?

దీపావళికి ఆన్ లైన్లో ఎక్కువ అమ్ముడైనవి ఏవి?
దీపావళికి కొత్త బట్టలు, స్వీట్లు, టపాసులు, పూజా వస్తువులు, బంగారం, వెండి కొంటారు. ఒకప్పుడు వీటిని కొనాలంటే దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్లో ఆర్డర్ పెడితే చాలు ఇంటికే వచ్చేస్తాయి. ఈ ఏడాది దీపావళికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో సంస్థలు ఏవి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయో డేటా విడుదల చేశాయి. గిఫ్ట్ ప్యాక్‌లు, స్వీట్లు, పూలు, ప్రమిదలు, డెకరేషన్ వస్తువులే కాకుండా బంగారం, వెండి నాణేలకు కూడా ఆన్లైన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
జెప్టో ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళి గిఫ్ట్ ప్యాక్‌ల ఆర్డర్లు మూడు రెట్లు పెరిగాయి. పండుగ సీజన్లో 4.68 లక్షల ప్రమిదలకు ఆర్డర్లు వచ్చాయి. పూలు, దండల ఆర్డర్లు కూడా గతేడాది కంటే 2.5 రెట్లు పెరిగాయి.
డైట్ కోక్ కావాలని ఆర్డర్స్
స్వీట్లు లేకుండా దీపావళి పూర్తికాదు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్వీట్‌గా కాజూ కట్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూ ఉన్నాయి. మరోవైపు, జెప్టోలో అత్యధికసార్లు ఆర్డర్ చేసిన స్వీట్ లడ్డూ అయినప్పటికీ, మొత్తం విక్రయాల్లో సోన్ పాప్డీ టాప్‌లో నిలిచింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో స్నాక్స్ ఆర్డర్లు 42 శాతం పెరిగాయి. దీపావళికి ముందు రోజు అత్యధికంగా ఆర్డర్ చేసిన నాన్-గ్రాసరీ ఐటమ్‌గా డైట్ కోక్ నిలిచింది.
బంగారం, వెండి
ధన్‌తేరాస్ రోజున బంగారం, వెండి కొనడం భారతీయులకు ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా ఇన్స్టంట్ డెలివరీ యాప్స్ ద్వారా వీటిని జనాలు కొన్నారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో బంగారు, వెండి నాణాలకు కూడా బాగానే ఆర్డర్టు వచ్చాయి.
ఈ దీపావళికి ముంబైలో అత్యధిక విలువైన సింగిల్ ఆర్డర్ నమోదైంది. అక్కడ ఒకరు లక్ష్మీ, గణేశ, కమలం డిజైన్లతో ఉన్న బంగారు నాణేలతో సహా మొత్తం రూ.1.11 లక్షల విలువైన వస్తువులు కొన్నారు. హైదరాబాద్‌లో ఒకరు 2 గ్రాముల బంగారు నాణెం, 100 గ్రాముల వెండి బిస్కెట్‌తో కలిపి రూ.52,215 విలువైన ఆర్డర్ చేశారు. బెంగళూరులో 2 గ్రాముల లక్ష్మీ డిజైన్ బంగారు నాణెం, ఆలివ్ ఆయిల్ సహా ఇతర వస్తువులకు రూ.32,298 ఖర్చు చేశారు. చెన్నైలో కూడా ఒకరు ఒక గ్రాము లక్ష్మీ డిజైన్ బంగారు నాణెం, 50 గ్రాముల వెండి బిస్కెట్‌ను రూ.26,770కు కొనుగోలు చేశారు.













