Toor Dal Vs Moong Dal : కందిపప్పు, పెసరపప్పు రెండింటిలో ఎందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది?
Toor Dal Vs Moong Dal : పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రోటీన్ కోసం చాలా మంది పప్పును తమ డైట్ లో భాగం చేసుకుంటారు. కానీ, ఏ పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది..? ప్రోటీన్ కోసం ఏ పప్పు తినాలి?

ఏ పప్పు తినాలి?
మన ఇంట్లో ప్రతిరోజూ వండే వంటకాల్లో కందిపప్పు, పెసరపప్పు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాంబర్, పప్పు, పప్పుచారు చేయాలంటే కందిపప్పు గుర్తొస్తే... కిచిడీ, పెసరట్టు అనగానే పెసరపప్పు గుర్తొస్తుంది. అయితే, ఈ రెండింటిలో దేనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఏది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది? ఈ రెండింటిలో ఏ పప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి..?
ఏ పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది..?
2023లో ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన పోషకాహార అధ్యయనం ప్రకారం.. ఈ రెండు పప్పుల్లో ప్రోటీన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
పెసరపప్పు.. ప్రతి 100 గ్రాముల పచ్చి పెసరపప్పులో దాదాపు 23.86 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కందిపప్పు.. సాధారణంగా ఇతర పప్పులతో పోలిస్తే, ప్రామాణిక లెక్కల ప్రకారం కందిపప్పులో ప్రోటీన్ శాతం పెసరపప్పుతో సమానంగా లేదా కాస్త తక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనం ప్రకారం.... కందిపప్పుతో పోలిస్తే.. పెసరపప్పులో ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ, 100 గ్రాముల మినపప్పులో 25.21 గ్రాములు, మసూర్ దాల్ ( ఎర్ర కందిపప్పు) లో 24.63 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే పెసరపప్పు కన్నా కూడా.. మినపప్పు, ఎర్ర కందిపప్పులో కాస్త ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.
ఆరోగ్యపరంగా ఏది మేలు..?
పెసరపప్పు : ఇది చాలా తేలికగా అరిగిపోతుంది. జీర్ణవ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు కాబట్టి, రోజూ తినడానికి, అనారోగ్యం నుండి కోలుకుంటున్న వారికి ఇది ఉత్తమ ఎంపిక.
కందిపప్పు : ఇది మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందినప్పటికీ, ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనిని అతిగా తీసుకోవడం వల్ల కొన్ని శరీర తత్వాల వారికి వాత దోషం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా మసూర్ దాల్ లేదా పెసరపప్పును వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు కేవలం ప్రోటీన్ మోతాదును దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాలంటే... పెసరపప్పు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అయితే, ఏ పప్పు తినప్పటికీ దానిని అన్నం, గోధుమలు లేదా మిలెట్స్ కలిపి తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన కంప్లీట్ ప్రోటీన్ అందుతుంది.













