Afternoon Sleep: మధ్యాహ్నం లంచ్ తిన్నాక నిద్ర ముంచుకొస్తుందా? వీటిని తింటే రాదు
ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు మధ్యాహ్నం భోజనం చేశాక నీరసంగా మారిపోతారు. వారికి నిద్ర (Afternoon Sleep) ముంచుకొచ్చేస్తుంది. అలాంటివారు మధ్యాహ్న భోజనంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే నిద్ర రాకుండా ఉంటుంది.

మధ్యాహ్నపు నిద్ర
మధ్యాహ్న భోజనం చేశాక నిద్ర రావడం అనేది ఎంతో మందికి అనుభవంలోకి వచ్చిందే. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నా, లేకపోయినా భోజనం చేశాక కొందరికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇక ఆఫీస్‌లో ఉన్నవారికైతే ఆవలింతలు వస్తూనే ఉంటాయి. కాసేపు అలా నిద్రపోతే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఆఫీసులో ఎలా నిద్రపోతారు? భోజనం తిన్నాక నిద్రమత్తు అనేది ప్రోడక్టివిటీని తగ్గిస్తుంది. సరిగా పనిచేయనివ్వదు. కాబట్టి మీరు మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఆహారాన్ని తింటే నిద్ర రాకుండా ఉంటుందో తెలుసుకోండి.
పలావ్, బిర్యానీలు
మధ్యాహ్న భోజనంలో పలావ్, బిర్యానీ వంటివి అధికంగా తింటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ పెరిగిందో ట్రిఫ్టోఫాన్ అనే హార్మోను మెదుడుకు అధికంగా చేరుతుంది. ఇది మెలటోనిన్ గా మారుతుంది. మెలటోనిన్ అనేది నిద్రను తెచ్చే హార్మోన్. కాబట్టి మధ్యాహ్న భోజనంలో పలావ్ లు, ఫ్రైడ్ రైస్‌లు, బిర్యానీలు వంటివి తినకండి.
మాంసాహారాలు
మధ్యాహ్న భోజనలో చికెన్ అధికంగా తిన్నా కూడా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఎందుకంటే చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ నిద్ర హార్మోన్లు అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మెలటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల నిద్ర అధికంగా వస్తుంది.
స్వీట్లు
లంచ్ లో స్వీట్లు వంటివి తినకూడదు. పంచదారతో లేదా బెల్లంతో చేసిన పదార్థాలను తింటే రక్తంలో చక్కెర అధికంగా పెరుగుతుంది. ఇది నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుంది.
పాల ఉత్పత్తులు
మధ్యాహ్నం భోజనం చేశాక పాలు లేదా పెరుగు వంటివి తీసుకోకూడదు. ఇవి నిద్రను ప్రేరేపిస్తాయి. పాలల్లో క్యాల్షియంతో పాటూ ట్రిఫ్టోఫాన్ అధికంగా ఉంటుంది. అవే పెరుగులోనూ, మజ్జిగలోనూ కూడా ఉంటాయి. ఇవి నిద్ర అధికంగా వచ్చేలా చేస్తాయి. కాబట్టి మధ్యాహ్న భోజనంలో పెరుగును మాత్రం తినకండి.