రోజంతా జాలీగా, ఆనందంగా గడవాలంటే ఉదయం 9 గంటల్లోపు ఈ పనులు చేయండి..
సగం రోజు గడవగానే చాలా మంది డీలా పడిపోతుంటారు. చేస్తున్న పని పట్ల విసుగు పుట్టుకొస్తుంది. దీని వల్ల చేస్తున్న వర్క్ మీద ఏకాగ్రత పూర్తిగా పోతుంది. దాంతో మీరే ఏ విషయాన్ని సరిగ్గా నేర్చుకోలేరు. అలాగే మీ పనులను తొందరగా ఫినిష్ చేయలేరు. అలా కాకుండా రోజంతా ఉత్సాహంగా అలుపన్నదే లేకుండా ఉంటే రోజును చాలా ఎంజాయ్ చేయగలుగుతారు.

రోజంతా సంతోషంగా, ఉత్సాహంగా గడిచింది అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా మంది ఆఫ్ డేకే ఉన్న ఎనర్జీ అంతా పోయి నిరసంగా, నిస్సత్తువగా కనిపిస్తారు. ఎవరైనా రోజు ఎలా గడిచింది అని అనిగితే.. హా ఏముందు అదే బోరింగ్ లైఫ్ అంటూ సమాధానమిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం ఎన్ని గంటలు పని చేసినా ఎంతో ఫ్రెష్ గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా రోజును ఎంజాయ్ చేస్తుంటారు. వారు అలా ఉండటానికి కారణం వారు కొన్ని పనులు చేయడం వల్లే. అది కూడా ఉదయం తొమ్మిది గంటలలోపే. మీరు కూడా ఆ పనులు చేస్తే మీ రోజు ఎంతో జాలీగా గడుస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో సక్సెస్ అయిన అందరిలో ఉండే సహజ లక్షణం ఉదయం పూట తొందరగా లేవడం. ఉదయం పూట తొందరగా లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని వారికి తెలుసు. అందుకే చాలా మంది సక్సెస్ పీపుల్ పొద్దున్నే లేస్తారు. అదే పొద్దెక్కిందాక నిద్రిస్తే కేవలం బద్దకం మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం పూట ఆరు గంటల్లోపు లేవండి. స్టార్టింగ్ లో కాస్త కష్టంగా అనిపించినా.. తర్వాత మీకే అలవాటు అవుతుంది.
ప్రతిరోజూ ఒక గ్లాసు నీళ్లతో మీ అమూల్యమైన రోజును ప్రారంభించండి. ఎందుకంటే చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, జీర్ణక్రియ మెరుగ్గా పనిచేసేందుకు, శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పోవడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి. మీకు తెలుసా.. మన మెదడు 70 శాతం నీళ్లతోనే ఉంటుంది. అందుకే నీళ్లు తాగడం ఎంతో అవసరం. దాంతో మీ మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని నీళ్లను తాగి మళ్లీ లేచే వరకు నీళ్లను తాగరు కాబట్టి బాడీ డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఉదయం లేచిన వెంటనే నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి.
ధ్యానం మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేయగలదు. ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటుగా మానసికంగా కూడా బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ధ్యానం వల్ల శరీరంపై సానుకూల ప్రభావం పడుతుంది. మార్నింగ్ టైం లో ధ్యానం చేయడం వల్ల ఆ రోజులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు కలుగుతుంది. అందుకే ప్రతి రోజూ ఉదయం ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేయండి.
వ్యాయామం: శరీరం ఫిట్ గా ఉండటానికి వ్యాయం ఎంతో సహాయపడుతుంది. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో లాభాలు జరుగుతాయి. మన మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటుగా పనిపట్ల ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అంతేకాదు ప్రతి రోజూ ఉదయం పూటే వ్యాయామాలు చేయడం వల్ల ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుస్తుంది. కాబట్టి లేచిన వెంటనే ఒక అరగంట పాటు వ్యాయామం చేయండి.
ఉదయం లేచిన వెంటనే మీ రోజు వారి పనులు మొదలు పెట్టకండి. మీ కోసం కాస్త సమాయాన్ని కేటాయించుకోండి. ఒక పావు గంట సమయం తీసుకుని పాటలు వినడం లేదా మీకు నచ్చిన పుస్తకాలు చదవండి. అందులో ఈ పనులను టీ లేదా కాఫీ తాగుతూ చేస్తే మీ రోజు మరింత అందంగా గడుస్తుంది.