- Home
- Life
- DMart : డీమార్ట్‌లో ఏ వస్తువులు, ఎలా కొనాలి? ఈ స్మార్ట్ షాపింగ్ టిప్స్ ఫాలోకండి.. వేలకు వేలు ఆదా చేసుకొండి
DMart : డీమార్ట్‌లో ఏ వస్తువులు, ఎలా కొనాలి? ఈ స్మార్ట్ షాపింగ్ టిప్స్ ఫాలోకండి.. వేలకు వేలు ఆదా చేసుకొండి
డీమార్ట్‌లో షాపింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే డబ్బులు మిగుల్చుకోవచ్చు. మరి ఏ వస్తువులు బల్క్‌గా కొనాలి, ఏవి కొనకూడదు, యూనిట్ ప్రైస్, ఆఫర్లు, ఎక్స్‌పైరీ డేట్ లాంటి స్మార్ట్ షాపింగ్ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

డీమార్ట్ లో స్మార్ట్ షాపింగ్
డీమార్ట్ లాంటి పెద్ద స్టోర్లలో అన్నీ ఒకేచోట దొరుకుతాయి. కాబట్టి నెలవారీ సరుకులు కొనడం చాలా ఈజీ. కానీ లోపలికి వెళ్లాక కంటికి కనిపించిన ప్రతి వస్తువూ కొనేస్తే బిల్లు తడిసిపోపెడవుతుంది. డిస్కౌంట్, ఆఫర్లలో వస్తువులు లభించినా మొత్తం ఖర్చు పెరిగిపోతుందన్నమాట.
స్మార్ట్ షాపింగ్ అంటే తక్కువ ధరకు సరుకులు కొనడం మాత్రమే కాదు. అవసరమైన వస్తువును, సరైన పరిమాణంలో, సరైన ధరకు కొనడమే అసలైన పొదుపు. ఇది అసలుసిసలైన స్మాార్ట్ షాపింగ్… డీమార్ట్ లో కూడా డబ్బులు మిగుల్చుకునేలా షాపింగ్ చేయవచ్చు.
ఫస్ట్ లిస్ట్... ఆ తర్వాతే షాపింగ్!
డీమార్ట్‌కు వెళ్లే ముందు ఇంట్లో ఏమేం సరుకులు ఉన్నాయి, ఏమేం సరుకులు లేవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. బియ్యం, పప్పులు, నూనె, సబ్బులు, డిటర్జెంట్, టూత్‌పేస్ట్ లాంటివి ఎంత స్టాక్ ఉన్నాయో చూసుకున్నాకే లిస్ట్ రాసుకోవడం మంచిది. ముఖ్యంగా "ఆఫర్ ఉంది కదా... కొనేద్దాం" అనే ఆలోచనను పక్కన పెట్టండి. ఒక వస్తువు ధర తక్కువగా ఉన్నా, అది మీకు అవసరం లేకపోతే దాన్ని కొనడం వృథా ఖర్చే అవుతుంది.
డీమార్ట్ లాంటి స్టోర్లకు వెళ్లే ముందే మీ బడ్జెట్ ఎంతో ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకు, నెల సరుకులకు ₹5,000 కేటాయిస్తే, అందులో ₹4,000 అవసరమైన వస్తువులకు, ₹500 క్లీనింగ్, పర్సనల్ కేర్ వస్తువులకు, మిగిలిన ₹500 అత్యవసరాల కోసం పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆఫర్లు చూడగానే అనవసరమైన వస్తువులు కొనే ఛాన్స్ తగ్గుతుంది.
సరుకులు బల్క్‌గా కొనడం ఎప్పుడు కరెక్ట్?
బియ్యం, పప్పులు, చక్కెర, ఉప్పు లాంటివి త్వరగా పాడవవు. కాబట్టి మీ ఇంటి నెలవారీ అవసరాలకు తగ్గట్టు వీటిని బల్క్‌గా కొనొచ్చు. అయితే పెద్ద ప్యాకెట్ ఎప్పుడూ తక్కువ ధరకే వస్తుందని గుడ్డిగా నమ్మకండి. 1 కిలో, 2 కిలోలు, 5 కిలోల ధరలను పోల్చి చూసి, కిలోకు ఎంత పడుతుందో లెక్కేసుకోండి… ఎలా తక్కువయితే అలాగే కొనండి.
ఉదాహరణకు 1 కిలో వస్తువు ₹100 ఉండి, 2 కిలోల ప్యాకెట్ ₹180 ఉంటే అది లాభమే. కానీ అదే 2 కిలోల ప్యాకెట్ ₹200 ఉంటే మాత్రం పెద్ద ప్యాకెట్ కొనడం వల్ల ఉపయోగం ఉండదు… కిలో అయినా, 2 కిలొలు అయినా సేమ్ ధర.
క్లీనింగ్ ప్రొడక్ట్స్‌తో భారీగా డబ్బు ఆదా చేయొచ్చు
ఫ్లోర్ క్లీనర్, డిష్‌వాష్ లిక్విడ్, డిటర్జెంట్, టాయిలెట్ క్లీనర్, వాషింగ్ పౌడర్ లాంటివి మనం తరచుగా కొంటుంటాం. వీటి ధరల్లో ఉండే చిన్న తేడా కూడా నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటిని కొనేటప్పుడు కేవలం ప్యాకెట్ ధరను మాత్రమే చూడకండి. 100 గ్రాములు లేదా 100 మిల్లీలీటర్ల ధర ఎంత పడుతుందో లెక్కేసుకోండి.
కొన్నిసార్లు చిన్న ప్యాకెట్ తక్కువ ధరకు వస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ పెద్ద ప్యాకెట్ యూనిట్ ప్రైస్ చూస్తే అది ఇంకా తక్కువగా ఉండొచ్చు.
పర్సనల్ కేర్ వస్తువుల విషయంలో జాగ్రత్త
సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్, ఫేస్‌వాష్ లాంటి వాటిపై కాంబో ప్యాక్, మల్టీ-ప్యాక్ ఆఫర్లు ఉంటాయి. అయితే ఇంట్లో అందరూ వాడే వస్తువులైతేనే వాటిని ఎక్కువగా కొనడం వల్ల లాభం ఉంటుంది.
ముఖ్యంగా ఎక్స్‌పైరీ డేట్, ప్యాక్ సైజ్, యూనిట్ ప్రైస్.. ఈ మూడింటినీ చూశాకే కొనండి. ఒకే బ్రాండ్‌ను రెగ్యులర్‌గా వాడేవాళ్లు, ఆ వస్తువు సాధారణ ధరను గుర్తుంచుకుంటే అసలైన ఆఫర్‌ను ఈజీగా పసిగట్టొచ్చు.
స్నాక్స్ కోసం లిమిటెడ్ బడ్జెట్
డీమార్ట్‌లో సరుకులతో పాటు స్నాక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ లాంటివి మనల్ని ఆకర్షిస్తాయి. ఇవి తక్కువ ధరకే వస్తున్నట్లు అనిపించినా, అన్నీ కలిపి కొనేసరికి బిల్లు భారీగా పెరిగిపోతుంది. అందుకే నెలవారీ సరుకుల బడ్జెట్‌లో స్నాక్స్ కోసం ఒక లిమిట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం.
కూరగాయలు, పండ్లు కొనేటప్పుడు ఈ తప్పు చేయకండి
కూరగాయలు, పండ్ల విషయంలో "ఎక్కువ కొంటే డబ్బులు మిగులుతాయి" అనే రూల్ పనిచేయదు! ఆఫర్ ఉందని వీటిని ఎక్కువగా కొనకండి. ఇంట్లో వాడేంత వరకే కొనడం మంచిది. తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువగా కొనేసి, అవి వాడకముందే పాడైపోతే మీ డబ్బు మొత్తం వృథా అయినట్లే.
బిల్లు కట్టే ముందు కచ్చితంగా ఈ పని చేయండి!
బిల్లింగ్ కౌంటర్‌కు వెళ్లే ముందు మీ ట్రాలీని ఒకసారి చెక్ చేసుకోండి. "ఈ వస్తువు నిజంగా అవసరమా? ఇంట్లో ఇదివరకే ఉందా? ఆఫర్ లేకపోయినా దీన్ని కొనేవాడినా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ మూడు ప్రశ్నల్లో దేనికైనా "కాదు" అనే సమాధానం వస్తే, ఆ వస్తువును తీసుకెళ్లి మళ్లీ షెల్ఫ్‌లో పెట్టేయండి.

