Old Sarees to New Designs: పాత చీరలతో అదిరిపోయే కొత్త లుక్.. ఈ డిజైన్స్ చూస్తే వదలరు!
Old Sarees to New Designs: మహిళల వార్డ్‌రోబ్‌లో చీరలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇష్టంగా కొనుక్కున్న చీరలు కూడా ఒకటి రెండుసార్లు కట్టుకొని పక్కన పెట్టుస్తుంటారు. అయితే కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే ఆ పాత చీరలను మరో రకంగా వాడుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

పాత చీరలతో కొత్త డిజైన్లు
బీరువాలో ఏళ్ల తరబడి పడి ఉన్న పట్టు, కాటన్, డిజైనర్ చీరలను ఇకపై పాతవి అని పక్కన పెట్టేయకండి. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలకు ఎంతో ఇష్టపడి కొన్న చీరలను కొన్నిసార్లు మాత్రమే కట్టుకుని ఆ తర్వాత వాడకుండా వదిలేశారా? అయితే ఈ ఐడియాస్ మీకోసమే.
ఒక పాత చీరతో అందమైన కుర్తీ కుట్టించుకోవచ్చు, మోడ్రన్ బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు, ఇంటిని అలంకరించే కర్టెన్లు తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా హ్యాండ్ బ్యాగులు, గౌన్లు, లెహంగాలు ఇలా రకరకాల కొత్త రూపాల్లోకి మార్చుకోవచ్చు.
తక్కువ ఖర్చుతో కొత్త దుస్తులు పొందడంతో పాటు పాత జ్ఞాపకాలను భద్రంగా ఉంచుకోవచ్చు. ఆ కోవలో మీ ఇంట్లో ఉన్న పాత చీరలతో క్రియేట్ చేయగల సూపర్ డిజైన్లు ఏంటో ఇక్కడ చూద్దాం.
అందమైన కుర్తీ, సల్వార్ సూట్
పాత కాటన్ లేదా పట్టు చీరతో అందమైన కుర్తీ, సల్వార్ సూట్ కుట్టించుకోవచ్చు. చీర అంచు భాగాన్ని చేతులకు, మెడకు, కింది భాగానికి వాడితే మంచి డిజైనర్ లుక్ వస్తుంది.
లెహంగా చోళీ
హెవీ జరీ వర్క్ ఉన్న పట్టు చీరలను లెహంగాగా మార్చుకోవచ్చు. చీర కొంగును బ్లౌజ్ డిజైన్‌కు, బోర్డర్‌ను లెహంగా కింది భాగానికి వాడుకోవచ్చు. ఇవి పెళ్లిళ్లు, నిశ్చితార్థం లాంటి వేడుకలకు భలేగా సెట్ అవుతాయి.
మ్యాక్సీ గౌన్
సాఫ్ట్ సిల్క్, జార్జెట్, షిఫాన్ లాంటి చీరలతో పొడవైన మ్యాక్సీ గౌన్ కుట్టించుకోవచ్చు. చీర బోర్డర్‌ను గౌన్ కింది భాగంలో జాయింట్ చేస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.
లాంగ్ స్కర్ట్
పాత చీరతో అందమైన లాంగ్ స్కర్ట్ కుట్టించుకోవచ్చు. కాటన్ చీరలతో రోజువారీ వాడుకునే స్కర్ట్స్, పట్టుచీరలతో పార్టీ వేర్ స్కర్ట్స్ భలేగా డిజైన్ చేసుకోవచ్చు.
డిజైనర్ బ్లౌజ్
పాత పట్టుచీర కొంగుపై ఉండే అందమైన డిజైన్లను ఉపయోగించి కొత్త మోడల్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. హై నెక్, బ్యాక్ నెక్, ఎంబ్రాయిడరీ, స్లీవ్‌లెస్ ఇలా ఎన్నో డిజైన్లను ట్రై చేయవచ్చు.
దుపట్టా, స్టోల్
పాత చీర కొంగు భాగాన్ని మాత్రం విడిగా కట్ చేసి అందమైన దుపట్టాగా వాడుకోవచ్చు. అంచుల వెంట లేస్ లేదా కుచ్చులు యాడ్ చేస్తే సరికొత్త లుక్ వస్తుంది.
అందమైన హ్యాండ్ బ్యాగులు
పాత చీర అందమైన బోర్డర్, కొంగును ఉపయోగించి టోట్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, క్లచ్ బ్యాగ్ లాంటివి తయారు చేయవచ్చు. లోపల గట్టి లైనింగ్ క్లాత్ వేస్తే చాలా కాలంపాటు వాడుకోవచ్చు.
కుషన్ కవర్లు
పాత చీరలతో సోఫా, మంచం మీద పెట్టుకునే అందమైన కుషన్ కవర్లు కుట్టొచ్చు. ముఖ్యంగా పట్టుచీర జరీ బోర్డర్, కొంగును కుషన్ ముందు భాగంలో వాడితే ఇంటికి ట్రెడిషనల్ లుక్ వస్తుంది.
కర్టెన్లు
పాత కాటన్ చీరలు, పల్చటి షిఫాన్ చీరలను కిటికీ కర్టెన్లుగా మార్చుకోవచ్చు. రెండు వేర్వేరు రంగుల చీరలను కలిపి కుట్టినా అందమైన కర్టెన్లు రెడీ అవుతాయి.
పొట్లీ బ్యాగులు
పట్టుచీర చిన్న ముక్కలతో అందమైన పొట్లీ బ్యాగులు తయారు చేయొచ్చు. నగలు, గిఫ్ట్ ఐటమ్స్, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇవి భలేగా పనికొస్తాయి. పండగలు, పెళ్లిళ్లకు కూడా వీటిని స్టైల్‌గా తీసుకెళ్లొచ్చు.
తోరణాలు, వాల్ డెకరేషన్
చీర జరీ బోర్డర్, పూల డిజైన్లు, అందమైన కొంగును ఉపయోగించి గుమ్మానికి తోరణం, వాల్ డెకరేషన్ లాంటివి చేయొచ్చు. పండగ టైమ్‌లో ఇవి ఇంటికి కొత్త కళను తెస్తాయి.
పాత చీరలను వాడేముందు గుర్తుంచుకోవాల్సినవి
చీర ఎంత పాతదైనా క్లాత్ ఇంకా గట్టిగా ఉందా లేదా అనేది ముందుగా చూసుకోవాలి.
మరకలు, చిరుగులను గమనించి, చిరిగిన భాగాలను పక్కనబెట్టి, మంచి కండిషన్లో ఉన్న క్లాత్‌ను మాత్రమే వాడాలి.
బార్డర్‌ను వేస్ట్ చేయకూడదు. కొత్త డిజైన్‌కు అసలైన అందం తీసుకొచ్చేది చీర జరీ బార్డర్, కొంగు మాత్రమే.
పల్చటి లేదా ట్రాన్స్పరెంట్ క్లాత్‌తో బట్టలు కుడుతున్నప్పుడు లైనింగ్ తప్పనిసరిగా వేయాలి.
చీరను కట్ చేసేముందే ఏ భాగంలో ఏ డిజైన్ రావాలో టైలర్‌తో ముందుగానే మాట్లాడుకోవాలి.















