- Home
- Life
- Chia Seeds Vs Sabja Seeds: చియాసీడ్స్ కీ సబ్జా సీడ్స్ కి తేడా ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్..?
Chia Seeds Vs Sabja Seeds: చియాసీడ్స్ కీ సబ్జా సీడ్స్ కి తేడా ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్..?
Chia Seeds Vs Sabja Seeds: చియాసీడ్స్ , సబ్జా సీడ్స్ ఈ రెండూ చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ, ఈ రెండింటికీ తేడా ఏంటి? ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏవి బాగా పని చేస్తాయి.?

Chia Vs Sabja
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలని జిమ్‌లు, డైట్ల చుట్టూ తిరుగుతున్నారా? ఉదయాన్నే పరగడుపున తాగే డ్రింక్స్‌లో చియా సీడ్స్ కలుపుకోవాలో, లేక సబ్జా గింజలు వేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూడటానికి దాదాపు అచ్చు గుద్దినట్లు ఒకేలా కనిపించే ఈ రెండు గింజలు, మన శరీరంపై పనిచేసే తీరు మాత్రం పూర్తిగా భిన్నం. మరి బరువు తగ్గడానికి, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరగడానికి ఈ రెండింటిలో ఏది అసలైన 'సూపర్ ఫుడ్'? అనే విషయం ఇప్పుడు చూద్దాం...
సబ్జా గింజలు, చియా సీడ్స్ ఎలా పని చేస్తాయి..?
చియా సీడ్స్ అయినా, సబ్జా గింజలైనా నేరుగా శరీరంలోని కొవ్వును కరిగించవు . కానీ, ఆకలిని నియంత్రించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి. అయితే, ఇవి పనిచేసే వేగం, విధానంలో ముఖ్యమైన తేడా ఉంది.
చియా సీడ్స్..
చియా గింజలలో కరిగే ఫైబర్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను నీళ్లలో నానబెట్టినప్పుడు ఇవి జెల్ (Gel) లాగా మారి, జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన భావన ఉండి, అనవసరపు ఆహారం తీసుకోకుండా ఉంటాం. అంతేకాదు.. ఈ చియాసీడ్స్ తో పాటు.. సరైన డైట్ , వ్యాయామం కూడా చేస్తే.. బరువు తగ్గడం సులభం అవుతుంది.
సబ్జా గింజలు..
తులసి జాతికి చెందిన సబ్జా గింజల్లో 30 శాతానికి పైగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇవి నీళ్లలో వేయగానే చాలా త్వరగా ఉబ్బుతాయి.
పొట్ట ఉబ్బరం తగ్గిస్తాయి: చాలామంది పొట్ట ఉబ్బరాన్ని, గ్యాస్‌ను పొట్ట కొవ్వుగా పొరబడుతుంటారు. భోజనం తర్వాత వచ్చే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి సమస్యలను సబ్జా గింజలు సమర్థవంతంగా తగ్గిస్తాయి.
ఎలా పనిచేస్తాయి?: ఇవి చాలా వేగంగా పనిచేసి, ఆకలిని వెంటనే అదుపు చేస్తాయి. తద్వారా అతిగా తినడం తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.
రెండింటిలో ఏది బెస్ట్..?
మీరు బరువు తగ్గాలి, పొట్ట చుట్టూ కొవ్వు కరిగించాలి అనుకుంటే, మెటబాలిజం పెంచుకోవాలి అంటే చియా సీడ్స్ ఎంచుకోండి. లేదు... మీకు ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం, అతిగా ఆకలి వేయడం వంటి సమస్యలు ఉంటే సబ్జా గింజలు తీసుకోవడం మేలు చేస్తాయి. పోషకాహార నిపుణుల సూచన ప్రకారం, ఈ రెండింటిలో ఏదో ఒకటి కాకుండా, రోజుల మార్చి రెండింటినీ డైట్ లో చేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
ఉత్తమ ఫలితాల కోసం వీటిని ఎలా తీసుకోవాలి..?
ఏ గింజలైనా సరే, తినడానికి ముందు కనీసం 1 నుండి 2 టీస్పూన్లు నీళ్లలో బాగా నానబెట్టాలి (పొడిగా ఎప్పుడూ తినకూడదు).
నానబెట్టిన గింజలను నిమ్మరసం, స్మూతీలు లేదా పెరుగులో కలుపుకుని తీసుకోవచ్చు.
వీటిని భోజనానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, సమతుల్య ఆహారంలో ఒక భాగంగా మాత్రమే తీసుకోవాలి.














