Pillow: మెడ నొప్పి లేకుండా హాయిగా నిద్ర పట్టాలంటే ఎలాంటి దిండును ఎంచుకోవాలి?
Pillow: తెల్లవారి నిద్రలేవగానే మెడనొప్పి, నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారా? మీరు పడుకునే తీరు, దిండు వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. మరి సరైన దిండును ఎలా ఎంచుకోవాలి? ఎప్పుడు మార్చాలి?

ఎలాంటి దిండును ఎంచుకోవాలి?
దిండ్లు తయారుచేసే వాళ్లు మెత్తటివి, గట్టివి, మెమరీ ఫోమ్, రేటు ఎక్కువ ఉండే స్పెషల్ ఫీచర్స్ అంటూ రకరకాల రకాలను ప్రమోట్ చేస్తుంటారు. కానీ మంచి దిండు అనేది మీరు పడుకునే భంగిమ, మీ శరీర అవసరాల మీదే ఆధారపడి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేచి దిండును సరిచేసుకోవడం, మడవటం, చల్లగా ఉండే వైపుకు తిప్పుకోవడం... ఇలా నిద్రపోయే ప్రతి ఒక్కరికీ దిండు గురించి ఒక పర్సనల్ అభిప్రాయం ఉంటుంది. అసలు పర్ఫెక్ట్ దిండు అంటూ ఒకటి ఉందా? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం.
తలా, మెడా & భుజాలు ఒకే సరళ రేఖలో ఉండాలి
దిండు తయారుచేసే వాళ్లు కాటన్, ఫైబర్ ఫిల్ లేదా రకరకాల ఆకృతులతో దిండ్లను అమ్మాలని చూస్తారు. కానీ తల, మెడ, భుజాలు ఒకే సరళ రేఖలో ఉండేలా చూసే దిండే ఎప్పుడూ బెస్ట్. పక్కకు తిరిగి పడుకునే వాళ్లకు చెవికి, భుజానికి మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎత్తుగా, గట్టిగా ఉండే దిండు వాడితే మంచిది. వెల్లకిలా పడుకునే వాళ్లకు గడ్డం ఛాతీ వైపు వంగకుండా చూసే ఒక మోస్తరు ఎత్తు ఉండే దిండు కరెక్ట్.
బోర్లా పడుకునే వాళ్లకు మెడ ఒక పక్కకు తిరుగుతుంది కాబట్టి, తల, మెడ, భుజాలకు సపోర్ట్ ఇచ్చే కొద్దిగా ఒంపు ఉన్న దిండు సరిపోతుంది. అందరికీ ఒకే ఎత్తు ఉండే దిండు సెట్ కాదు. వెడల్పాటి భుజాలు ఉన్నవాళ్లు మెత్తటి పరుపు మీద పడుకున్నప్పుడు భుజం లోపలికి దిగుతుంది కాబట్టి, వాళ్లకు తక్కువ ఎత్తు ఉన్న దిండు అవసరం కావచ్చు.
నొప్పి, గురక & దిండు లైఫ్ టైమ్
ఉదయం లేవగానే మెడ లేదా భుజంలో నొప్పి వచ్చి, అరగంటలో తగ్గిపోతే అది దిండు, పడుకునే పొజిషన్ లేదా పరుపు వల్ల కావచ్చు. ఆ నొప్పి రోజంతా ఉన్నా, ఎక్కువైనా, లేదా చేతిలో జలదరింపు, తిమ్మిరి, నీరసం ఉన్నా వెంటనే డాక్టర్ను కలవాలి. లాప్టాప్ ముందు వంగి కూర్చునే సమయాన్ని పట్టించుకోకుండా, దిండును తప్పు పడుతుంటారు కొందరు.
గురక తగ్గడానికి దిండ్ల మీద దిండ్లు వేసుకోవడం లేదా మెడను ఎక్కువగా సాగదీయడం వల్ల ప్రయోజనం ఉండదు; నిద్ర సమస్యలకు డాక్టర్ను సంప్రదించడమే బెటర్. రేటు ఎక్కువ ఉండే దిండు దానంతటదే బెస్ట్ అనడానికి ఎలాంటి కచ్చితమైన ఆధారం లేదు; కూలింగ్ జెల్ లేదా చెవి దగ్గర గ్యాప్ ఉండేలా డిజైన్ చేసినవి కొన్ని ప్రత్యేక అవసరాలకు పనికొస్తాయి. దిండును సగానికి మడిచినప్పుడు అది మళ్లీ పాత షేప్కి రాకపోతే అది పాడైపోయిందని అర్థం. సింథటిక్ ఫైబర్ దిండ్లు 1–2 ఏళ్లు, మెమరీ ఫోమ్ లేదా లాటెక్స్ దిండ్లు 2–3 ఏళ్ల వరకు మన్నుతాయి.
స్లీప్ యాంగ్జైటీని దూరం పెడదాం
పని, సోషల్ మీడియా, వెబ్ సిరీస్లు ఇలా ఎన్నో మన నిద్ర సమయాన్ని మింగేస్తున్నాయి. స్లీప్ ట్రాకర్లు అనేవి కేవలం కొలమానాలు మాత్రమే; వాటి స్కోర్ల వెనక పడితే నిద్ర గురించి లేనిపోని ఆందోళన పెరుగుతుంది. రాత్రి కనీసం 8 గంటల నిద్రను టార్గెట్ చేయాలి; మధ్యలో మెలకువ వచ్చినా 5–10 నిమిషాల్లో మళ్లీ నిద్రలోకి జారుకోవాలి. ఉదయం లేవగానే ఒళ్లు పట్టేయకుండా ఉంటే మీ దిండు సరిగ్గానే పనిచేస్తోందని అర్థం.














