oranges side effects: వామ్మో నారింజ పండ్లను అతిగా తింటే ఇంత ప్రమాదమా..!
oranges side effects: పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకని వీటిని పరిమితి లేకుండా తింటుంటాం. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా నారింజ పండ్లను అతిగా తింటే ఈ అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిట్రస్ ఫ్రూట్ అయిన నారింజ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా ఈ పండు నచ్చని వారంటూ ఎవరూ ఉండరేమో. ఈ పండు వేసవి తాపాన్ని తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ జ్యూస్ ను తాగడం వల్ల పొట్ట చల్లబడుతుంది. అందుకే చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఆరెంజ్ జ్యూస్ ను తాగడానికి ఇష్టపడుతుంటారు.
నారింజ పండ్లు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే కొందరు రోజుకు రెండు పూటలా ఆరెంజ్ జ్యూస్ ను తాగుతుంటారు. ఈ ఆరెంజ్ జ్యూస్ పిల్లలకే కాదు వృద్ధులకు కూడా మేలు చేస్తుంది. అలా అని దీనిని అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నారింజ పండ్లను అతిగా తింటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు బలహీనపడతాయి.. నారింజ పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే మన శరీరంలో అవసరానికి మించి సి విటమిన్ స్టోర్ అయితే మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎక్కువ కాలం పాటు విటమిన్ సి తీసుకోవడం ఎముకలు బలహీనంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శక్తి కోల్పోవడం.. నారింజ పండ్లను తినడం వల్ల మన శరీరానికి శక్తి లభిస్తుందని అందరూ అంటుంటారు. నిజానికి దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని తినడం వల్ల తక్షణమే శక్తి లభించినా.. కొంత సమయం తర్వాత ఉన్న శక్తి కాస్త తగ్గుతుంది. ఒకేసారి శక్తి పెరిగి.. అప్పుడే తగ్గిపోతే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకే శక్తి స్థాయిని ఒకే విధంగా నిర్వహించే ఆహారాన్ని ఎల్లప్పుడూ తినాలి.
డయేరియాకు దారితీస్తుంది.. కొంతమంది ఒకేసారి నాలుగైదు నారింజ పండ్లను తింటుంటారు. అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఇది మన జీర్ణవ్యవస్థను ప్రాభావితం చేస్తుంది. నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువైతేనే ఈ సమస్యలు వస్తాయి. కానీ నారింజ పండును అన్నం తిన్న తర్వాత తింటే జీర్ణం అవడం కష్టంగా మారుతుంది. ఖాళీ కడుపుతో నారింజ పండ్లను తింటే జీర్ణక్రియ మరింత క్షీణిస్తుంది.
ఆకలి పెరగడం.. నారింజలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆకలిని పెంచుతుంది. ఆకలి పెరిగినప్పుడు.. అవసరానికి మించి తింటుంటాం. దీంతో మీరు బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవారు నారింజ పండ్లను ఎక్కువగా తినకూడదు. అలాగే ఉదయం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం మానేయండి.