Parenting: మగ పిల్లలకి ప్రతి తల్లి నేర్పాల్సిన విలువలు ఇవి.. మీరు నేర్పుతున్నారా?
Parenting: మగ పిల్లలు సరిగా పెరగడం అనేది తల్లి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చిన్నతనం నుంచి తల్లి నేర్పే కొన్ని విషయాలు వారి భవిష్యత్తును బంగారుమయం అవుతుంది.

తల్లి కొడుక్కి ఏం చెప్పాలి? ఎలా పెంచాలి?
పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద బాధ్యత. ముఖ్యంగా, మగ పిల్లలను పెంచే విషయంలో చాలా కాలంగా కొన్ని మాటలు వింటూ వస్తున్నాం. కానీ, వాటిని పక్కన పెట్టి, పిల్లల ఆలోచనా విధానం మార్చాల్సిన బాధ్యత తల్లులపై ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలు ఇలానే ఉండాలి అని గీత గీసే బదులు, వారిని ఒక మంచి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా తీర్చిదిద్దేందుకు తల్లి చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం...
1.మగపిల్లలు ఏడ్వకూడదా?
చాలా మంది ఇళ్లల్లో ‘ మగ పిల్లలు ఏడ్వకూడదు’ లేదా ‘ ఆడ పిల్లలా ఏడుస్తావేంటి?’ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ, మగ పిల్లలు కూడా ఏడవచ్చు. అందులో తప్పేమీ లేదు అని మనం చెప్పాలి. ఏడవడం అనేది బలహీనత కాదు, మనసులోని బాధను బయట పెట్టడమనే విషయాలి వారికి చెప్పాలి. ఏడ్వడం నేరం కాదు.. బాధను లోపలే దాచుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్పాలి.
2.ఇంటి పనులు అందరివి...
చాలా మందికి ఇంటి పనులు అంటే కేవలం ఆడవారు మాత్రమే చేయాలి అనే భావనలో ఉంటారు. కానీ, ఇది తప్పు అనే విషయం చిన్నప్పటి నుంచి మగ పిల్లలకు నేర్పించాలి. వంట చేయడం, పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను అబ్బాయిలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. పనిలో ఆడ, మగ తేడా లేదని, బాధ్యతలను పంచుకోవడమే ఇంట్లో సంతోషానికి పునాది అని నేర్పించాలి.
3.ఆడ పిల్లలను గౌరవించడం..
చాలామంది ఇంట్లో అమ్మ, అక్క, చెల్లెళ్లను గౌరవించమని చెబుతారు. అది ఎంత ముఖ్యమో.. బయట ఉండే ఇతర మహిళలను, తోటి అమ్మాయిలను కూడా అంతే గౌరవించడం నేర్పడం కూడా అంతే ముఖ్యం. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయడం లేదా విమర్శించడం సరికాదని స్పష్టంగా చెప్పాలి.
4. 'నో' (NO) అనే మాటకు గౌరవం ఇవ్వడం నేర్పండి
ఎవరైనా ఒక విషయానికి 'నో' అని చెప్పినప్పుడు దానిని అంగీకరించడం, ఆ వ్యక్తి అభిప్రాయాన్ని, సరిహద్దులను గౌరవించడం ఎంత ముఖ్యం అనేది అబ్బాయిలకు చిన్నతనం నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఇది వారిని భవిష్యత్తులో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారుస్తుంది.
5. తోటివారికి సాయపడే గుణం
శారీరక బలం అనేది ఇతరులను భయపెట్టడానికి కాదు, బలహీనంగా ఉన్నవారికి రక్షణగా నిలవడానికి అని నేర్పాలి. అలాగే కష్టాల్లో ఉన్న తోటివారికి సాయం చేయడం, జెండర్ పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడటం ప్రాథమిక బాధ్యత అని తెలియజేయాలి.
6. ఓటమిని, విమర్శలను స్వీకరించడం
జీవితంలో ఎప్పుడూ గెలుపే ఉండదు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, లేదా ఇతరులపై కోపం చూపించకుండా ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకోవడం నేర్పాలి. తప్పులు చేయడం సహజమని, వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగడమే నిజమైన విజయం అని వివరించాలి.
ఈ విలువలు నేర్పితే.. మీ పిల్లల భవిష్యత్తు చాలా ఆనందంగా సాగుతుంది. ఆస్తులు ఇవ్వకపోయినా.. ఈ విలువలు మాత్రం మీ బిడ్డను కాపాడతాయి.








