Zinc Rich Diet: జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలు.. వీటిని రోజూ తింటేనే మీ ఆరోగ్యం సేఫ్..!
Zinc Rich Diet: శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించేందుకు జింక్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను మన రోజు వారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో తగినంత జింక్ ఉంటేనే మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించుకోగలుగుతుంది. జింక్ వల్ల గాయాలు తొందరగా నయమవుతాయి. శరీర ఎదుగుదల బాగుంటుంది. మొదడు పనితీరు మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందుకే మన రోజు వారి ఆహారంలో జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ జింక్ ను మన శరీరం సొంతంగా ఉత్పత్తి చేయదు. దాన్ని నిల్వ కూడా చేయదు. దీన్ని కేవలం వివిధ జంతు, మొక్కల ఆధారిత ఆహారాల ద్వారా మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ జింక్ వేటిలో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
nuts
గింజలు (Nuts)
గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. గింజల ద్వారా మన శరీరానికి జింక్ ఒక్కటే కాదు ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. బాదం, జీడిపప్పు, వేరుశెనగ వంటి గింజల్లో జింక్ కు కొదవే ఉండదు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు వంటి ఇతర పోషకాలుంటాయి. అన్ని రకాల గింజల్లో జింక్ శాతం జీడిపప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో జింక్ తక్కువగా ఉండేవారు ఇతర గింజలకు బదులుుగా జీడిపప్పులను తినండి.
పాల ఉత్పత్తులు (Dairy products)
పాల ఉత్పత్తుల్లో కూడా జింక్ అధిక మొత్తంలోనే ఉంటుంది. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల ద్వారా మీ శరీరానికి జింక్ తో పాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. ఈ ఆహారాలను శరీరంలో జింక్ శోషణను మెరుగుపరుస్తాయి.
గుడ్లు (Eggs)
గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, సెలీనియం, ప్రోటీన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే జింక్ లభిస్తుంది. గుడ్డు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
డార్క్ చాక్లెట్ (Dark chocolate)
డార్క్ చాక్లెట్లలో కూడా జింక్ ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. దీనిలో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను పోగొడుతాయి. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.
చిక్కుళ్లు (Legumes)
చిక్కుళ్లల్లో ఇతర పోషకాలతో పాటుగా జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బీన్స్ వంటి ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావాల్సిన జింక్ లభిస్తుంది. వీటిలో జింక్ తో పాటుగా విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
మాంసం (meat)
మాంసాహారాల్లో జింక్ తో పాటుగా ఇనుము, విటమిన్ బి, క్రియేటిన్, ఇతర ముఖ్యమైన ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పంది, గొర్రె మాంసాల ద్వారా జింక్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అయినప్పటికీ ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఓట్స్ (Oats)
ఓట్స్ లో కూడా జింక్ ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అంతేకాదు ఇది ఫైబర్ కు గొప్ప వనరు కూడా. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఎన్నో రకాల రోగాలను సైతం తగ్గిస్తాయి.
విత్తనాలు (seeds)
విత్తనాల్లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. గుమ్మడి విత్తనాలు, జనపనార విత్తనాలను కొంత మొత్తంలో తినడం వల్ల జింక్ తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు అందుతాయి.