చలికాలంలో శరీరంలో మంట తగ్గాలంటే వీటిని తినడం మానేయండి
శరీరంలో మంట విపరీతమైన నొప్పిని, అసౌకర్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా శరీరంలో మంట చలికాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మంట తగ్గాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

చలికాలంలో మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా చల్లని గాలుల వల్ల దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగున్న వారికి ఈ సీజన్ లో ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఈ సీజన్ లో దీర్ఘకాలిక మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవన శైలి వంటివి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మంట దానంతట అదే తగ్గిపోతుంది. శరీర మంటను తగ్గించుకోవడానికి చలికాలంలో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మంట అంటే ఏమిటి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంట అనేది గాయం, సంక్రమణ లేదా వ్యాధికి శరీర రోగనిరోధక వ్యవస్థ సహజ ప్రతిస్పందన. ఇది ప్రభావిత ప్రాంతానికి వివిధ రసాయనాలను, రోగనిరోధక కణాలను రిలీజ్ చేస్తుంది. ఎరుపు, వేడి, వాపు, నొప్పి మంట లక్షణాలు. అయితే దీర్ఘకాలిక మంట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వివిధ వ్యాధుల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చల్లటి వాతావరణం వల్ల ఫ్లూ, జలుబు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదం బాగా పెరుగుతుంది. అయితే ఇది శరీరంలో మంటకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు పకోడాలు వంటి ఎక్కువ ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలనే తింటుంటారు. నిజానికి ఈ ఆహారాలు మంటను మరింత పెంచుతాయి. చలికాలంలో నిశ్చల జీవనశైలి సర్వ సాధారణం. కానీ ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే మంట కూడా ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో మంట రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు రుచికరంగా ఉంటాయి. కానీ ఇవి మన శరీరాలకు చేసే హాని అంతా ఇంతా కాదు. చిప్స్, కుకీలు, ఇన్ స్టంట్ నూడుల్స్ మొదలైన ఆహారాల్లో ఉప్పు, చక్కెరలు మరీ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో కృత్రిమ రంగులు, ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని తింటే మీరు అమాంతం బరువు పెరిగిపోతారు. ఇది మంటను పెంచుతుంది.
వేయించిన ఆహారాలు
బంగాళదుంప చిప్స్, పకోడీలు, మిరపకాయ బజ్జీలు, సమోసాలు, కచోరీలు వంటి వేయించిన ఆహారాలు కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో మంటను కలిగిస్తాయి. వేయించిన ఆహారాలను తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
పాల ఉత్పత్తులు
లాక్టోస్ అసహనం ఉన్నవారికి పాల ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది. లాక్టోస్ అసహనం ఒక సాధారణ సమస్య. పాల ఉత్పత్తులలో చక్కెర (లాక్టోస్) ను పూర్తిగా జీర్ణించుకోలేకపోతుంటారు చాలా మంది. లక్టోస్ అసహనం ఉన్నవారు అన్ని పాల ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు
వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీలు వంటి ఆహారాలు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల కిందికే వస్తాయి. ఆరోగ్యయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. శరీరంలో మంటను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి వీటిని తినకపోవడమే మంచిది.
ఆల్కహాల్
ఆల్కహాల్ కూడా ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. మందును మరీ ఎక్కువగా తాగితే కూడా శరీరంలో మంట పెరుగుతుంది. అలాగే వారి రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల చలికాలంలో మీకు లేనిపోని రోగాలొచ్చే ప్రమాదం పెరుగుతుంది.