Railway Jobs : టెన్త్, ఐటిఐ పాసైతే చాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా నేరుగా రైల్వే జాబ్
Railway Jobs : ఇండియన్ రైల్వేలో అప్రెంటిస్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగా త్వరలోనే ఎంపిక జరగనుంది… ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.

రైల్వేలో 4651 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
2026-27 సంవత్సరానికి గాను నార్తర్న్ రైల్వేలో 4651 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యింది… ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్నో, ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్, మొరాదాబాద్, జమ్మూ డివిజన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. లక్నోలో 1,525, ఢిల్లీలో 1,312, అంబాలాలో 979, ఫిరోజ్‌పూర్‌లో 740, మొరాదాబాద్‌లో 63, జమ్మూలో 32 ఉద్యోగాలను కేటాయించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 11న ప్రారంభమయ్యాయి… డిసెంబర్ 11 చివరి తేదీ.
విద్యార్హతలు, వయోపరిమితి
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. దీనికితోడు భారత ప్రభుత్వం గుర్తించిన NCVT లేదా SCVT కింద సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, మెషినిస్ట్ లాంటి ట్రేడ్‌లలో కోర్సు చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
డిసెంబర్ 11, 2026 నాటికి 15 ఏళ్లు నిండి, 24 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ అప్రెంటిస్ జాబ్స్ కు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ అప్రెంటిస్ స్థానాలకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతి, ITI మార్కులను సగటు తీసి, రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కు పిలుస్తారు. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే వయసులో పెద్ద వాళ్లకు ముందు అవకాశం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు ఎంతంటే?
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ITI మార్కుల మెమో, ఫోటో, సంతకం లాంటివి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్‌మిట్ చేశాక ఎలాంటి మార్పులు చేయడానికి కుదరదు కాబట్టి వివరాలన్నీ సరిచూసుకున్నాకే సబ్‌మిట్ చేయాలి.
డిసెంబర్ 11 లాస్ట్ డేట్
అర్హత ఉన్నవాళ్లు నార్తర్న్ రైల్వే అఫీషియల్ వెబ్‌సైట్ rrcnr.org ద్వారా డిసెంబర్ 11, 2026 రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఒకరు ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. తమ ITI ట్రేడ్‌కు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడే అప్లై చేసుకోవాలి.
గమనిక : ఇది కేవలం అప్రెంటిస్ అవకాశం మాత్రమే.. ట్రైనింగ్ పూర్తవగానే రైల్వేలో పర్మినెంట్ జాబ్ ఇస్తారని గ్యారెంటీ లేదు. అందుకే అప్లై చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం ముఖ్యం.









