- Home
- Jobs
- Government Jobs : నెలకు రూ.81,100 జీతం, భారీ అలవెన్సులు .. ఇండియన్ ఆర్మీలో 1121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
Government Jobs : నెలకు రూ.81,100 జీతం, భారీ అలవెన్సులు .. ఇండియన్ ఆర్మీలో 1121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
BSF Head Constable Recruitment 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, దరఖాస్తు ప్రక్రియ, సాలరీ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు
Indian Army Jobs : దేశభక్తి కలిగిన చాలామంది యువత భారత సైన్యంలో చేరాలని కలలు కంటుంటారు. ఆర్మీ సెలక్షన్స్ కోసమే ప్రత్యేకంగా సన్నద్దం అవుతుంటారు. ఇలాంటివారికి గుడ్ న్యూస్... భారత ఆర్మీలో భాగమైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు గ్రూప్ 'C', నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ కాంబాట్ సపోర్ట్ విభాగం కిందకు వస్తాయి.
ఈ నియామక ప్రక్రియ ద్వారా భారతదేశం అంతటా 1121 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన సిబ్బందికి ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉంటుంది... అంటే వారిని దేశంలో ఎక్కడైనా బాధ్యత అప్పగించవచ్చు... అవసరమైతే విదేశాలలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలు పొందినవారు BSF చట్టాలు, నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. భారతదేశంలోని ప్రధాన పారా మిలిటరీ దళాలలో ఒకటైన బిఎస్ఎఫ్ లో పనిచేయడం వల్ల క్రమశిక్షణగా జీవితం సాగుతుంది... సమాజంలో మంచి హోదా, గౌరవాన్ని పొందుతారు.
బిఎస్ఎఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ
అధికారిక బిఎస్ఎఫ్ నియామక పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు... అంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమయ్యింది. ఆగస్టు 24, 2025 రాత్రి 11:00 గంటలకు ప్రారంభమై దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 23, 2025 రాత్రి 11:59 గంటలకు కొనసాగనుంది. చివర్లో రద్దీ ఎక్కువయి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఆఫ్‌లైన్ లేదా ప్రత్యామ్నాయ దరఖాస్తు పద్ధతులు ఆమోదించబడవు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అధికారిక BSF నియామక పోర్టల్‌ను సందర్శించండి - rectt.bsf.gov.in.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియను పూర్తి చేయండి.
మీ వ్యక్తిగత వివరాలతో లాగిన్ అవ్వండి... హెడ్ కానిస్టేబుల్ (RO/RM) నియామకం 2025 లింక్‌ను ఎంచుకోండి.
సరైన వివరాలతో ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
దరఖాస్తును సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం తుది ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
బిస్ఎఫ్ ఉద్యోగాలకు విద్యార్హతలు
బిఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) ఉద్యోగానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక్కడ పేర్కొన్న సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్, రేడియో & టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేషన్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్రిపరేషన్ & కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సంబంధిత రంగాల్లో రెండు సంవత్సరాల ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగానికి అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక్కడ పేర్కొన్న సబ్జెక్ట్స్ లో 60% మార్కులు సాధించి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకట్రానిక్స్, ఐటి & ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్ టెక్నీషియన్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రంగాల్లో రెండు సంవత్సరాల ఐటిఐ సర్టిఫికెట్‌తో మెట్రిక్యులేషన్ కూడా ఆమోదయోగ్యమైనది.
బిఎస్ఎఫ్ ఉద్యోగాల నియామక ప్రక్రియ
బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ మూడు దశల్లో జరుగుతుంది.
స్టేజ్ 1 - శారీరక ప్రమాణాల పరీక్ష (PST) & శారీరక సామర్థ్య పరీక్ష (PET) : RFID సాంకేతికతతో నిర్వహిస్తారు. నియామక ప్రక్రియలో ముందుకు సాగాలంటే అభ్యర్థులు ఈ దశలో అర్హత సాధించాలి.
స్టేజ్ 2 - కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో నిర్వహించబడుతుంది. సిబిటి తర్వాత అభ్యర్థులు తమ సమాధాన పత్రాలను యాక్సెస్ చేయవచ్చు... అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు బిఎస్ఎఫ్ అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.. అభ్యర్థులకు ఎస్ఎంఎస్/ఇమెయిల్ ద్వారా కూడా సమాచారం అందించబడుతుంది.
స్టేజ్ 3 - డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్‌లు : ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (RO అభ్యర్థులకు మాత్రమే), డీటెయిల్డ్/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (DMR/RME) ఉంటాయి. ఈ రౌండ్ల తర్వాత తయారు చేయబడిన మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ జీతం ఎంత?
BSF హెడ్ కానిస్టేబుల్ (RO/RM) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పే లెవెల్-4 (₹ 25,500 - ₹ 81,100) కింద జీతం పొందుతారు. హెడ్ కానిస్టేబుల్ ఉద్యగం పొందిన అభ్యర్థులకు బేసిక్ సాలరీతో పాటు మంచి భత్యం, రేషన్ డబ్బు, దుస్తుల భత్యం, ఉచిత వసతి లేదా HRA, రవాణా భత్యం, LTC, సరిహద్దు ప్రాంతాల్లో కఠినమైన విధులకు ప్రత్యేక అలవెన్సులు లభిస్తాయి. ఇంకా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కొత్తగా నియమితులైన వారికి ఉచితంగా బిఎస్ఎఫ్ యూనిఫారాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలు కొత్త పెన్షన్ పథకం (NPS) కిందకు వస్తాయి.