DA Hike : 2 శాతం డిఏ పెంపు.. అంటే ఏ ఉద్యోగి శాలరీ ఎంత పెరుగుతుందో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కరవు భత్యం (DA) 2% పెంచింది. దీంతో లక్షలాది మందికి వెంటనే ఊరట లభించింది. ఈ పెంపుతో ప్రస్తుతం ఎంత శాలరీ ఉన్న ఉద్యోగులకు అదనంగా ఎంత వస్తుందో తెలుసా..?

ఉద్యోగులకు గుడ్ న్యూస్
DA Hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో అదీ అక్షయ తృతీయ వేళ కేంద్రం ఉద్యోగులకు తీపికబురు అందించింది. వారి కరవు భత్యం (DA) 2% పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై కూడా చర్చలు వేగవంతం చేసింది. ఈ రెండు పరిణామాలతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కరవు భత్యం 2% పెంపు..
కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏను 2 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని డీఏను క్రమం తప్పకుండా సవరిస్తారు. ఈ పెంపుతో నెల జీతంపై నేరుగా ప్రభావం పడుతుంది.
జీతాల్లో పెరుగుదల ఎంతుంటుంది..?
డీఏ పెంపుతో ఉద్యోగుల నెలవారీ ఆదాయంలో గుర్తించదగిన మార్పును వస్తుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.18,000 అయితే డిఏ పెంపుతో నెల జీతానికి రూ.360 నుంచి రూ.540 వరకు అదనంగా చేరతాయి. అదే రూ.29,200 బేసిక్ పే ఉన్నవారికి రూ.584 నుంచి రూ.876 వరకు అదనపు ఆదాయం రావచ్చు.
ఇక రూ.56,100 వంటి అధిక బేసిక్ పే ఉన్న ఉద్యోగులకు, ఈ పెంపు నెలకు రూ.1,100 కంటే ఎక్కువగా ఉండొచ్చు. రూ.2.5 లక్షల బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులకు ఈ ప్రయోజనం నెలకు రూ.5,000 నుంచి రూ.7,500 మధ్య ఉండొచ్చు. పనిలో ఎలాంటి మార్పు లేకుండానే ఏడాది వ్యవధిలో ఆదాయం పెరగడం ఒక ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ లాంటిదని నిపుణులు అంటున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 డిమాండ్.. కనీస వేతనం రూ.69,000?
డీఏ పెంపుతో పాటే ఇప్పుడు 8వ వేతన సంఘంపై కూడా చర్చలు ఊపందుకున్నాయి. వేతన స్వరూపంలో భారీ మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెద్ద మార్పులు చూడొచ్చు.
నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (National Council-Joint Consultative Machinery) ఏకంగా 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే ప్రస్తుతం ఉన్న రూ.18,000 కనీస వేతనం ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు 'కుటుంబం' నిర్వచనంలో తల్లిదండ్రులను కూడా చేర్చాలని కోరుతున్నారు.
భత్యాలు, ఇంక్రిమెంట్లపైనా దృష్టి...
ఉద్యోగ సంఘాలు కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇతర భత్యాలను పెంచాలని, వార్షిక ఇంక్రిమెంట్ రేటును కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చుల మధ్య ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం 2% డీఏ పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ, 8వ వేతన సంఘం అమలైతే భవిష్యత్తులో వారి ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పులు రానున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు, అంచనాలు పెరిగాయి.

