తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురై.. భారత వైమానిక దళానికి (IAF) చెందిన పైలట్ మరణించిన విషయం తెలిసిందే. అయితే అంత విషాదం జరిగిన తర్వాత కూడా దుబాయ్ ఎయిర్ షో కొనసాగించడంపై యూఎస్ ఎయిర్ ఫోర్స్ (USAF) పైలట్ మేజర్ టేలర్ ఫెమా హీస్టర్ మండిపడ్డారు.
దుబాయ్ లో ఇటీవల జరిగిన ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మరణించారు. అయితే, ఓ పైలట్ చనిపోయిన తర్వాత కూడా దుబాయ్ ఎయిర్ షో 2025ను కొనసాగించాలన్న నిర్వాహకుల నిర్ణయంపై యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) పైలట్ మేజర్ టేలర్ ఫెమా హీస్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎఫ్-16 వైపర్ డెమాన్‌స్ట్రేషన్ టీమ్ కమాండర్ అయిన హీస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్నారు. "ఐఏఎఫ్ పైలట్, అతని సహచరులు, కుటుంబానికి గౌరవ సూచకంగా" తమ చివరి ప్రదర్శనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
టెక్సాస్‌లో పుట్టిన ఎఫ్-16 వైపర్ పైలట్ హీస్టర్‌కు 1,500 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఉంది. తేజస్ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు అతను తన ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఆ దుర్ఘటన తర్వాత కూడా షో కొనసాగించడంతో తాను షాక్‌కు గురైనట్లు హీస్టర్ తెలిపారు. రెండేళ్లుగా పనిచేస్తున్న తమ బృందానికి ఇది మొదటి అనుభవమని పేర్కొన్నారు. తామంతా నిశ్శబ్దంగా దూరం నుంచి ఆ పరిణామాలను చూస్తూ.. ఖాళీ పార్కింగ్ స్థలం పక్కన నిలబడ్డ భారత మెయింటెనెన్స్ సిబ్బంది గురించి, నేలపై పడి ఉన్న విమానం నిచ్చెన గురించి, పైలట్ కారులో ఉన్న అతని వస్తువుల గురించి ఆలోచించామని హీస్టర్ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.
మంటలు ఆరిపోయిన తర్వాత ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారని హీస్టర్ గుర్తుచేసుకున్నారు. ఆ షాకింగ్ నిర్ణయంతో తమ బృందం అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోస్టులో రాసుకొచ్చారు. అయితే, ప్రమాదం నేపథ్యంలో షో ఆగిపోతుందని భావించిన తనకు షాక్ తగిలిందని.. అనౌన్సర్ ఉత్సాహంగా ఉండటం, ప్రజలు షోను చూడటం గమనించానని పేర్కొన్నారు.
నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది: యూఎస్ పైలట్
''అంతపెద్ద ప్రమాదం జరిగినా.. ఎయిర్‌షో తిరిగి ప్రారంభం కాగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. స్పాన్సర్లు చప్పట్లు కొట్టారు. మా స్పాన్సర్లందరికీ అభినందనలు అంటూ స్పీకర్లు మాట్లాడారు. 2027లో మళ్లీ కలుద్దాం అని ప్రకటించారు. ఇదంతా తనకు ఇబ్బందికరంగా అనిపించింది.. చాలా స్వార్థపూరితం అనిపించింది" అని హీస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.


