- Home
- International
- అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఇండియన్స్‌కి పిడుగులాంటి వార్త.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఇండియన్స్‌కి పిడుగులాంటి వార్త.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
USA: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సంచలన నిర్ణయాలతో హడలెత్తిస్తున్న ట్రంప్ తాజాగా మరో కీలక దిశగా అడుగులు వేశారు.

కఠినంగా మారుతోన్న వలస విధానాలు
అమెరికాలో వలస విధానాలు మరింత కఠినమవుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న తాజా నిర్ణయం వందలాది భారతీయ వలసదారులను నేరుగా ప్రభావితం చేయబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రీన్యువల్ సదుపాయాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పటికే అమెరికాలో ఉన్న అనేక మంది ఉద్యోగులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఆటోమేటిక్ రెన్యువల్‌కి ముగింపు
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం, 2025 అక్టోబర్ 30 తర్వాత వర్క్ పర్మిట్ (Employment Authorization Document - EAD) పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై ఆటోమేటిక్ రీన్యువల్ వర్తించదు. అంటే, దరఖాస్తు చేసిన వెంటనే పాత పర్మిట్ గడువు ముగిసినా, ఆటోమేటిక్‌గా పని కొనసాగించే అవకాశం ఉండదు. ఈ నిర్ణయం ఇప్పటికే పర్మిట్ పొడిగించుకున్న వారికి మాత్రం వర్తించదు. అధికారులు ఈ చర్యను “జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం దృష్ట్యా తీసుకొచ్చింది” అని పేర్కొన్నారు.
బైడెన్ కాలంలోని సడలింపులకు ముగింపు
బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వలసదారులకు గరిష్ఠంగా 540 రోజుల వరకు తాత్కాలికంగా పనిచేసే అవకాశం ఇచ్చే సౌకర్యం ఉండేది. అంటే, వర్క్ పర్మిట్ గడువు ముగిసినా, దాని రీన్యువల్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు వారు ఉద్యోగాన్ని కొనసాగించగలిగేవారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, రెన్యువల్ దరఖాస్తులను ముందుగానే సమర్పించాలనే నిబంధనను అమలు చేస్తోంది.
ఆలస్యం చేస్తే ప్రమాదంలో ఉద్యోగం
అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (USCIS) ప్రకారం.. వర్క్ పర్మిట్ రెన్యువల్ గడువు ముగియడానికి కనీసం 180 రోజుల ముందే దరఖాస్తు చేయాలి. ఆలస్యమైతే పని అనుమతులు తాత్కాలికంగా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయమై USCIS డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ.. “అమెరికాలో ఉద్యోగం అనేది హక్కు కాదు, అది కేవలం అవకాశం మాత్రమే” అని వ్యాఖ్యానించారు.
ఎవరికీ ఈ నియమాలు వర్తిస్తాయి?
ఈ కొత్త నియమాలు ప్రధానంగా గ్రీన్‌కార్డ్ పెండింగ్‌లో ఉన్నవారికి, వారి భాగస్వాములకు, పిల్లలకు, అలాగే F-1, M-1 వీసాలతో ఉన్న విద్యార్థులకు వర్తిస్తాయి. అదే సమయంలో H-1B, L-1B, O, P వీసా హోల్డర్లకు ఈ కొత్త రూల్స్ ప్రభావం ఉండదు, ఎందుకంటే వారికి వర్క్ పర్మిట్ వీసా ద్వారానే లభిస్తుంది.
EAD (Employment Authorization Document) అంటే ఏంటి.?
EAD అనేది అమెరికాలో నిర్దిష్ట కాలానికి పని చేయడానికి ప్రభుత్వ అనుమతిని నిర్ధారించే అధికారిక డాక్యుమెంట్. ఇది లేకుండా వలసదారులు చట్టపరంగా ఏ సంస్థలోనూ పనిచేయలేరు. ఇది అమెరికాలో ఉద్యోగ హక్కుకు చట్టపరమైన ఆధారంగా పనిచేస్తుంది. గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు ఇది అవసరం ఉండదు కానీ వీసా ప్రక్రియలో ఉన్నవారు, విద్యార్థులు, డిపెండెంట్ వీసా ఉన్న వారి ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలి.